Aicc Released Telangana Mp Candidates List: రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానానికి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, వంశీ పేరును ఏఐసీసీ హోల్ట్ లో ఉంచింది.
అభ్యర్థుల నేపథ్యం ఇదే
☛ జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అక్కడ పార్లమెంట్ సభ్యునిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకూ నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా చేశారు. 2009 నుంచి 2014 వరకూ లోక్ సభ సభ్యునిగానూ ఉన్నారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గానూ సేవలందించారు.
☛ వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఆమె భర్త మహేందర్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆమె 2014 నుంచి 2023 వరకూ ఆలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ సమయంలోనే ప్రభుత్వ విప్ గానూ పని చేశారు.
☛ మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పి.బలరాం నాయక్ 2009 నుంచి 2014 వరకూ 15వ లోక్ సభ సభ్యునిగా పని చేశారు. ఉమ్మడి ఏపీలోని మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రధాని మన్మోహన్ మంత్రి వర్గంలోనూ సేవలందించారు.
☛ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కె.రఘువీర్ కు నల్గొండ నుంచి పార్టీ అధిష్టానం ఎంపీగా బరిలో నిలిపింది.
కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ సహా ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, సిక్కిం, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, అంబికాసోని, ముకుల్ వాస్నిక్, టీఎం సింగ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే, కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ స్థానాన్ని కేటాయించారు. ఆమె, గతేడాదే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను రాజ్ నంద్ గావ్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయబోతున్నారు.
Also Read: Amit Shah: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు అమిత్ షా – షెడ్యూల్ ఇదే!
మరిన్ని చూడండి
Source link