ByGanesh
Sun 15th Oct 2023 08:20 PM
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మంచి శకునం చూసుకుని అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. 55 మందితో వెలువడిన తొలి జాబితాలో ఎక్కువ శాతం మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన వారే ఉండటం గమనార్హం. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలో కీలక పాత్ర పోషించిన నేతలు ఉన్నారు. ఇక ఈసారి పార్టీ ముందుగా చెప్పినట్టే సీనియర్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు. కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ నేతలకైతే హ్యాండ్ ఇచ్చేసింది. వారు కోరుకున్న స్థానాలను అయితే వారికి కేటాయించలేదు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలకు పెద్ద పీట..
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరి రావుకు నిర్మల్.. అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సరితకు కూడా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు కల్పించింది. బీజేపీలో ఏమాత్రం ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన వినయ్ రెడ్డికి అభ్యర్థుల జాబితాలో చోటు లభించింది. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి అక్కడ కూడా తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఈయనకు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చోటు లభించింది. ఇక మైనంపల్లితో పాటు ఆయన కుమారుడికి సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించింది. మల్కాజ్‌గిరి, మెదక్ టికెట్లను ఈ తండ్రీకొడుకులకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ రాజేష్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు బీజేపీ నుంచి వచ్చిన చంద్రశేఖర్‌కు.. కొలను హన్మంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కసిరెడ్డి, జూపల్లి, వేముల వీరేశంకు తొలి జాబితాలో స్థానం లభించింది.
కీలక నేతల పరిస్థితేంటి?
మొత్తానికి తొలి జాబితాలో దాదాపు పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసింది. అయితే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు తొలి జాబితాలో చోటు లభించలేదు. ఆయన తాజాగా హస్తినకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌తో భేటీ అయ్యారు. మరి ఆయనకు ఎంపీ టికెట్ కేటాయిస్తారేమో చూడాల్సి ఉంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సైతం హోల్డ్‌లో పెట్టింది. దాదాపు రాష్ట్రంలోని కీలక నేతలెవరికీ టికెట్లు కేటాయించలేదు. మరి వీరందరి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయంతో ముందుకు వెళుతుందో చూడాలి. ఇక ఆశించిన టికెట్లు రాకపోవడంతో సీపీఐ ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. సింగిల్‌గానే పోటీ చేస్తుందా? లేదంటే బీఆర్ఎస్‌తో మింగిల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
All the tickets are for them.. and for their own..:
BRS and BJP leaders have a big fight