ByMohan
Wed 13th Mar 2024 02:17 PM
ఈమధ్యన మలయాళ చిత్రాలని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. చాలా సినిమాలు ఓటీటీకిలోకి వదలకుండా డబ్బింగ్ చేస్తూ థియేటర్స్‌లో విడుదల చేసి సక్సెస్ అందుకొంటుంటే.. కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అలా ఓటిటిలోకి రాగానే ఇలా ప్రేక్షకులు చూసెయాలనే ఆతృతతో కనబడుతున్నారు. రీసెంట్‌గా మలయాళంలో హిట్ అయిన ప్రేమలు చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో కార్తికేయ హిట్ కొట్టగా.. అదే వారం మలయాళంలో సక్సెస్ అయిన అన్వేషిప్పిన్ కండెతుమ్ తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి వదిలారు. గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అన్వేషిప్పిన్ కండెతుమ్ తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నేరపరిశోధన నేపధ్యంలో సాగిన ఈ చిత్రంలో ఎస్సై ఆనంద్ పాత్రలో టొవినో థామస్ కనిపించారు. 2018 చిత్రంతో టొవినో థామస్‌కి తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు.
ఇక అన్వేషిప్పిన్ కండెతుమ్ కథలోకి వెళితే.. ఎస్సై ఆనంద్ (టొవినో థామస్) పోలీస్ డ్రెస్‌కి న్యాయం చేయాలనే తపనతో కేసుని పక్కదారి పట్టిస్తున్న పై అధికారులకి వ్యతిరేకంగా పర్సనల్ ఇన్వెస్టిగేషన్‌తో ఓ అమ్మాయి మర్డర్ కేసుని ఛేదించి అసలైన హంతకుడిని పట్టుకుని కోర్టుకి హ్యాండోవర్ చేసే క్రమంలో.. ఆ హంతకుడు తప్పించుకుంటాడు. ఆ హంతకుడు సూసైడ్ చేసుకోవడంతో ఎస్సై ఆనంద్‌ని, అతనితో పని చేసిన టీమ్‌ని సస్పెండ్ చేస్తారు ఉన్నతాధికారులు. దానితో ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న ఆనంద్‌కి అతని నిజాయితీని, బలాన్ని నమ్మి.. ఆనంద్ అండ్ టీమ్‌కి పోలీస్ యూనిఫార్మ్ లేకపోయినా.. మరుగునపడిపోయిన మరో కేసుని అప్పగించి సాల్వ్ చేయమంటారు. మరి యూనిఫామ్ లేకుండా ఆ కేసుని ఆనంద్ తన టీమ్‌తో కలిసి ఎలా సాల్వ్ చేశాడు? మళ్ళీ తన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడా అనేది అన్వేషిప్పిన్ కండెతుమ్ షార్ట్ స్టోరీ.
ఎస్సై ఆనంద్ పాత్రలో టొవినో థామస్ కొత్తగా కనిపించారు.. పోలీస్ డ్రెస్ అయినా, ఖాకి యూనిఫార్మ్ లేకపోయినా పాత్ర పరిధి దాటకుండా అందులోనే ఉంటూ చివరి వరకూ ప్రేక్షకులని సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది.. మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, కెమెరా పనితనం చాలా నీట్‌గా వుంది. సంతోష్ నారాయణ్ BGM కథలోని మూడ్‌ని ఎలివేట్ చేసింది. దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయకుండా.. సహజంగా ఓ నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా.. ఒకేలా పని చేస్తాడనే విషయాన్ని సహజంగా చూపించాడు. సహజత్వంతో కూడిన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకునే ఆడియన్స్‌కు ఈ అన్వేషిప్పిన్ కండెతుమ్ చక్కటి ఎంటర్‌టైనర్.
Anweshippin Kandethum Movie Mini Review:
Anweshippin Kandethum Movie Report