AP Voters List : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో మార్పుచేర్పుల అనంతరం 2024 జనవరి 5 నాటికి పూర్తి స్థాయి ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో.. కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగింపు, ఓట్లు బదిలీ వంటి చర్యలు చేపట్టామన్నారు. ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఎవకైనా అభ్యంతరాలుంటే డిసెంబరు 9 లోపు తెలియజేయవచ్చన్నారు. డిసెంబరు 26 నాటికి జాబితాలో సమస్యలు పరిష్కరించి, వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.