Komatireddy Fires on Kadiyam Srihari in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడపురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని.. పార్టీని నాశనం చేసిందే ఆయన అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం కోల్పోయినా.. వారి బుద్ధి మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. బలహీనవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే.. కూర్చో కూర్చో అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అంత అహంకారం ఏంటని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పదవి విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనకు మంత్రి పదవి రావడం పార్టీ అంతర్గత వ్యవహారమని.. దాన్ని సాకుగా చూపుతూ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమలో తమకు చిచ్చు పెట్టాలన్న బీఆర్ఎస్ నేతల పాచికలు పారవని.. దమ్ముంటే కేసీఆర్ ను సభకు రావాలని సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని.. గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. త్యాగాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబం రూ.లక్షల కోట్లు దోచుకుందని అన్నారు.
‘మీకు ఈ జన్మలో మంత్రి పదవి రాదు’
‘ఉద్యమకారుడు తాడికొండ రాజయ్యను కడియం శ్రీహరి రెండుసార్లు మోసం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అవమానకర రీతిలో తొలగించేలా చేసి ఆ పదవిలోకి వెళ్లారు. కడియం ఏనాడూ తెలంగాణ కోసం మాట్లాడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను తప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయేసరికి ఆయన అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మంత్రిని అవుతానో లేదో తెలియదు. బీఆర్ఎస్ లో ఉండగా.. మీరు మాత్రం ఈ జన్మలో మంత్రి కాలేరు.’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఆగ్రహం
ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ దళిత నాయకుడైన కడియం పట్ట కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలకూ ఒకే రకమైన హక్కు ఉంటుందని.. అందరినీ ఒకేలా చూడాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి, మలక్ పేట రిజర్వాయర్లు పూర్తైన విషయం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. మంత్రిని అగౌరవంగా మాట్లాడే సంస్కారం మాకు లేదని అన్నారు. ‘మేడిగడ్డకు వెళ్లొచ్చి మాపై బురద జల్లుతున్నారు. ఏప్రిల్ లో ఎర్రటి ఎండల్లోనూ మిడ్ మానేరు, అప్పర్ మానేరు నిండుతున్నది నిజం కాదా.? సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ పునరుజ్జీవం కాళేశ్వరం ద్వారానే సాధ్యమయ్యాయి. ఇంత పెద్ద ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 3, 4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే రిపేర్ చేయండి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: BRS Mlas: మీడియా పాయింట్ వద్దకు నో ఎంట్రీ – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం
మరిన్ని చూడండి