NVSS Prabhakar: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని తన వద్ద ఆధారాలున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్ ఆరోపించారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు తాళాలు ఎవరు ఇచ్చారో తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటూ NVSS తన ఆరోపణల దాడిని మరింత తీవ్రం చేశారు. సీట్లు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తారంటూ ఆయన మరిన్ని ఆరోపణలు చేశారు. ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు.NVSS ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దీపాదాస్ మున్షీని బెంగాలీ కాళీమాతగా ఆయన వర్ణిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ”అవినీతి, అక్రమాలు, అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ బీజేపీ. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కి ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు ఉంది. ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేస్తున్నార”ని అద్దంకి దయాక్ర ఆరోపించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు. దీపాదాస్ మున్షీపై వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ”దీపాదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలను ఎదుర్కొన్న నాయకురాలు. ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతలు భయపడిపోయి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నార”ని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.
దీపాదాస్ మున్షీపై బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దీపాదాస్ మున్షీ నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలు. ఆమె తెలంగాణ ఇన్‌చార్జ్ గా ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో పసలేని, పనికిరాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరు. బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోము. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షికి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ చేశారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెడతాని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూండటంతో ఆ ఆధారాలను ఆయన బయట పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కారు ఎవరు ఇచ్చారు అన్నది కూడా బయటపడుతుంది. అప్పుడు మరింత రాజకీయ దుమారం రేగనుంది. ఒక వేళ ఆధారాలను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చూపించకపోతే తీవ్ర విమర్శల పాలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి