Australian Cricketer News: ఆస్ట్రేలియా క్రికెటర్లు మరోసారి భయంతో వణికిపోయారు. బంతి తలకు తగిలి 26 ఏళ్ల విల్‌ పుకోస్కీ అనే క్రికెటర్‌ గాయపడడంతో ఉలిక్కిపడ్డారు. అతనికి ఏమైందో అని తెగ హైరానా పడ్డారు. చివరికి అతడికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పుకోస్కీకి అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగకపోయినా … ఈ ఘటన దివంగత ఫిల్‌ హ్యూస్‌ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో హ్యూస్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అదే షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఇంచుమించు అలాంటి ఘటనే జరగడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది.

ఆనాటి ఘటనతో వణికిపోయి…

ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్‌షీల్డ్‌ టోర్నిలో విక్టోరియా జట్టు ఆటగాడు విల్‌ తలకు బంతి తాకడంతో గాయమైంది. ఎదుర్కొన్న రెండో బంతికే అతడు మైదానంలో కుప్పకూలిపోయాడు. టాస్మానియా జట్టు బౌలర్‌ రిలే మెరిడిత్‌ వేసిన బౌన్సర్‌ నేరుగా హెల్మెట్‌ ఎడమ వైపున తాకడంతో విల్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరిగాడు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి స్థానంలో క్యాంప్‌బెల్‌ కెల్‌అవే జట్టులోకి వచ్చాడు. పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైంది కానప్పటికీ అతను మ్యాచ్‌ మధ్యలోనే రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. పుకోస్కీ ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్ట్‌ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 72 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. విల్‌ కెరీర్‌లో తలకు బంతి తగిలి గాయపడటం ఇది 13వ సారి కావడం గమనార్హం. దీంతో ఆట కన్నా ప్రాణం ముఖ్యమంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.

జార్ఖండ్‌ గేల్‌కు రోడ్డు ప్రమాదం

మరో విధ్వంసకర బ్యాటర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో క్రికెట్‌ ప్రపంచం భయాందోళనలకు గురైంది. జార్ఖండ్ క్రిస్ గేల్‌, ధోనీ వార‌సుడిగా పిలుచుకుంటున్న రాబిన్ మింజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐపీఎల్‌ 2024 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రాబిన్‌ను ఊహించని ధర దక్కించుకుంది. రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్‌ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్‌ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని అత‌డి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు. శ‌నివారం ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వ‌స్తుండ‌గా రాబిన్ బైక్ స్కిడ్ అయిందని… ముందు ఒక బండి ఉండడంతో రాబిన్ త‌న బైక్‌ను నియంత్రించ‌లేక కింద ప‌డిపోయాడని రాబిన్‌ తండ్రి వెల్లడించాడు. దాంతో, అత‌డికి చిన్నపాటి గాయాల‌య్యాయని… ప్రస్తుతానికి అత‌డి అరోగ్యాన్ని వైద్యులు ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారని ఫ్రాన్సిస్ వెల్లడించాడు. ఐపీఎల్ సీజ‌న్ ఆరంభానికి ఇంకా రెండు వారాల పైనే ఉంది. ఆలోపు రాబిన్ కోలుకోవాల‌ని గుజ‌రాత్ అభిమానులు కోరుకుంటున్నారు. 21 ఏళ్ల రాబిన్‌ను 2024 ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది.

Source link