RathaYathra: తెలంగాణలో బీజేపీ(BJP) ఎన్నికల శంఖారావం పూరించింది. తమకు ఎంతో కలిసొచ్చిన రథయాత్ర పేరిట తెలంగాణ వ్యాప్తంగా రథయాత్రులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రమొత్తాన్ని లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఐదు క్లస్టర్లుగా విభజించి…ఒక్కో క్లస్టర్ కు ఒక రథాన్ని పంపింది. ఈ విజయసంకల్ప రథం..ఆయా లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనుంది. ఈ ప్రచార రథాలను నిన్న చార్మినార్(Charminar) వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

విజయసంకల్ప రథయాత్రలు
తెలంగాణ వ్యాప్తంగా విజయసంకల్ప యాత్రల పేరిట బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. నిన్న చార్మినార్(Charminar) భాగ్యలక్ష్మీ ఆలయం(Bhagya Lakshimi Temple)వద్ద ప్రచార వాహనాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పూజలు చేసి ప్రారంభించారు.5 క్లస్టర్లుగా 16 ఎంపీ సెగ్మెంట్‌లలో జరిగే ఈ రథయాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

ఎంపీ సీట్లపై కన్ను
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన బీజేపీ…దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పైగా ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది. అందులో భాగంగానే విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. నేడు నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద జరిగి ప్రచార రథాల పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

క్లస్టర్ల విభజన
హైదరాబాద్ మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లష్టర్లుగా రాష్ట్రాన్ని విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు ఉండనున్నాయి. ఈ ఐదు క్లష్టర్లకు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు.
భాగ్యలక్ష్మీ క్లస్టర్: ఈ కస్టర్ పరిధిలో మూడు ఎంపీ సెగ్మెంట్లు రానున్నారు. నేడు భువనగిరిలో విజయసంకల్ప యాత్ర ప్రారంభంకానుంది. ఈ రథయాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్ లోయాత్ర ముగియనుంది.

కొమురం భీం క్లస్టర్‌: ఈక్లస్టర్ పరిధిలోనూ నేడు ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌లో విజయసంకల్పయాత్ర ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరుకానున్నారు. ఈ యాత్ర సైతం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది

రాజరాజేశ్వరి క్లస్టర్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో నేడు ఈ రథయాత్రను గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించనున్నారు. 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ కరీంనగర్‌లో యాత్ర ముగియనుంది.

కృష్ణమ్మ క్లస్టర్‌ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో నేడు ప్రారంభం కానున్న రథయాత్ర 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది

కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ములుగులో ముగుస్తుంది.

తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ ఎన్నికలపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ కనీసం లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త సీట్లు చేజిక్కకున్నా…గతంలో గెలిచిన నాలుగు సీట్లయినా చేజారకుండా ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. బీజేపీకి ఎంతో కలిసొచ్చిన హిందూకార్డునే మరోసారి తెలంగాణలోనూ ప్రయోగిస్తోంది. ఇటీవలే అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడటంతో…అదే ఊపు కొనసాగించేలా రథయాత్రల పేరిట తెలంగాణ వ్యాప్తంగా విజయసంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది.

Source link