ByGanesh
Tue 17th Oct 2023 11:31 AM
ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కళ్లాలే లేకుండా పరుగులు పెడుతోంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ఈ పార్టీ ప్రిపేర్ అవుతూ వస్తోంది. నలుగురు మినహా అభ్యర్థుల జాబితా 50 రోజుల క్రితమే వెలువరించింది. ఇక నిన్నటికి నిన్న సగం మందికి బీఫామ్‌లు ఇచ్చింది. నేటి నుంచి ప్రచారాన్ని కూడా ప్రారంభించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. మంచి రోజు చూసుకుని నిన్న తొలి అభ్యర్థుల జాబితాను వదిలింది. ఇక ఈ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎప్పటి నుంచో జనాల్లో ఉంటూ వస్తున్నారు. కొత్తగా ప్రచారం మొదలు పెట్టాల్సిందంటూ ఏమీ లేదు. ఇక అభ్యర్థుల జాబితా విడుదలతో ఆ పార్టీలో ఫుల్ జోష్ వచ్చేసింది. దాదాపు కీలక నేతలకు సంబంధించిన జాబితానే కాంగ్రెస్ ఆపేసింది.
ఇక కీలక నేతలందరికీ తమ తమ స్థానాలపై ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ రెండు ప్రధాన పార్టీలు ఇలా ఉంటే తెలంగాణలో మూడో ప్రధాన పార్టీ అయిన బీజేపీ అడ్రస్ లేదు. కనీసం అభ్యర్థుల జాబితా విడుదలపై బీజేపీ నుంచి సమాచారం కూడా లేదు. అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి. ఆపై మేనిఫెస్టోను విడుదల చేయాలి. ఎన్ని ఉన్నాయి? అసలు జాబితానే అతీగతీ లేకుంటే ఎప్పుడు అభ్యర్థులు ప్రచారపర్వంలోకి వెళ్లాలి? లేటు అయితే సోదిలోనే లేకుండా పోతారు. అసలే తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే.. జనమంతా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పట్ల ఆకర్షితులైతే వస్తాయనుకున్న నాలుగైదు సీట్లు కూడా పాయే..
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే బీజేపీ ప్రకటిస్తుందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిన్న సగం స్థానాల అభ్యర్థులను ప్రకటించేసి రెండో జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఇవాళ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుందిలే.. త్వరలోనే ఫస్ట్ లిస్ట్ వస్తుందని ఆ పార్టీ కేడర్ భావించింది. అది కూడా అనూహ్యంగా వాయిదా పడింది. 40 మందితో కూడిన జాబితాను అయితే రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపించింది. దానినే హైకమాండ్ ఓకే చేయకుంటే.. మిగిలిన అభ్యర్థుల జాబితానును రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పంపిస్తుంది? ఎప్పుడు అది ఓకే అవుతుంది. షెడ్యూల్ వచ్చేసింది కదా. అభ్యర్థుల ప్రకటన ఇలా ఆలస్యమవుతుంటే విజయావకాశాలను స్వయంగా దెబ్బతీసుకున్నట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
BJP is unsurpassed in Telangana..:
BJP lagging behind in TS political race