BJP MLA Palvai Harish Babu met CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే కలవడం రాష్ట్ర రాజకీయాల్లోకి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన పాల్వాయి హరీష్ బాబు.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. సీఎం రేవంత్‌తో ఏం చర్చించారనే దానిపై ఎమ్మెల్యే హరీష్‌బాబు మీడియాతో మాట్లాడలేదు. అభివృద్ధి పనులపై వెళ్లారా? ఇంకేమైనా చర్చించారా? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు సీఎంను GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాషాయ కండువా తీసేసే మూడు రంగుల జెండా వేసుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది.గత కొంతకాలంగా బీజేపీకి మరియు బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న యాత్రలకు దూరంగా ఉంటున్న పాల్వాయి హరీష్ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పాల్వాయి హరీష్ బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో పోటీచేసిన ఆయన్ను పీపుల్స్‌వార్ కాల్చి చంపగా, ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
తర్వాత పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ లో కూడా చేరారు. 2018 ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి గెలిచారు. గత ఎన్నికల్లో ముక్కోణపు పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు.
అయితే పాల్వాయి హరీష్ బాబుకు పార్టీ మారాలన్న ఆలోచన లేదని .. ఆయన కేవలం నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తనను కలిసిన వారందరూ లేదా.. కలవడానికి అపాయింట్ మెంట్లు ఇచ్చే వారందరూ కాంగ్రెస్ పార్టీల చేరడానికి కాదని.. తనను ఎవరైనా కలవొచ్చని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇటీవల రేవంత్ ను వరుసగా కలుస్తున్నారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికైనా అపాయింట్ మెంట్ ఇస్తానని రేవంత్ చెబుతున్నారు. తాను ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం లేదని.. తమ పార్టీ ఎమ్మెల్యేల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటన్నారు.
మరిన్ని చూడండి