Telugu News: నేడు బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం కసరత్తు పూర్తయినట్లు సమాచారం. సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. 150 మందికి పైగా పేర్లతో రెండో జాబితా రూపొందించారని.. ఎలక్షన్ కమిటీ భేటీలో చర్చ అనంతరం ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే 195 లోక్ సభ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ రెండో జాబితాలోనే తెలంగాణలోని మిగిలిన స్థానాలను కూడా ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ రెండో జాబితా కోసమే గత మూడు రోజులుగా వివిధ రాష్ట్రాల కోర్ కమిటీలతో ఢిల్లీలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలపై కమలనాథులు కసరత్తు చేశారు. పొత్తులు ఖరారు కావడంతో బీజేపీకి కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే!

అయితే, ఏపీలో బీజేపీ తరపున పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అరకు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. తొలుత విజయవాడ, విశాఖపట్నం సీట్లను కూడా కేటాయించాలని బీజేపీ కోరగా.. అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసింది.

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..!
అరకు స్థానం నుంచి గీత, అనకాపల్లి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, కడప జిల్లా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Source link