KCR Comments in Karimnagar: తెలంగాణలోని 33 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. దేశంలోని ఒక్కో జిల్లా ఒక నవోదయ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం అని కేసీఆర్ గుర్తు చేశారు. తమకు కూడా నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని వంద యాభై ఉత్తరాలు మోదీకి రాశానని.. అయినా ఒక్క నవోదయ కూడా కేంద్రం ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ లో వేయొద్దని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కరీంగనర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కదనభేరి భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరై మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.
కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఎన్నో పనులు చేశారని అన్నారు. బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు ఎంత తేడా ఉందో గమనించాలని కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తాము కూడా ఇలాంటి మాటలు మాట్లాడగలమని అన్నారు. ఉద్యమ సమయంలో సన్నాసులు, దద్దమ్మలు లాంటి ఘాటు వ్యాఖ్యలు తాను కూడా మాట్లాడానని.. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాను ఎప్పుడూ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని గుర్తు చేశారు.
‘‘కొన్ని సందర్భాల్లో అత్యాశకో, దురాశకో పోయి ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూస్తున్నరు. ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడతం అని మాట్లాడిన్రు. ఇవాళ నోటికి మొక్కాలే. 400 హామీలిచ్చిన్రు. ఇప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతం అని ఓ మంత్రి అంటడు. బిడ్డా.. రైతుల చెప్పులు చానా బందోబస్తు ఉంటయ్. ఆరు గ్యారంటీల గురించి అడితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో ఏసుకుంటా.. పెండ మొకానికి రాసుకుంటా.. చీరుతా సంపుతా, మానవ బాంబునైతా అని మాట్లాడుతున్నడు. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది గౌరవమా? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా?’’ అని కేసీఆర్ మాట్లాడారు.
-కేసీఆర్
మరిన్ని చూడండి