Harish Rao Slams CM Revanth Reddy: తమ వంద రోజుల పాలన చూసి ఓటెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటున్నారని.. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏమైందని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రజలనే కాదని.. కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మీ 100 రోజుల పాలనలో ఏముంది.?. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్నట్లు సీఎం రేవంత్ మాట్లాడారు. తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమని అన్నారు. కానీ, రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు.?. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది.’ అంటూ విమర్శించారు.
‘పీఆర్వోలు ఎందుకు.?’
నిధుల దుర్వినియోగం అని చెప్పిన వారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు నియమించుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫ్లోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. అలాంటప్పుడు సీఎం రేవంత్ మోదీని ఎందుకు పొగడాలని ప్రశ్నించారు. ‘డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయలేదు. కనీసం బడ్జెట్ లోనూ రైతు రుణమాఫీ నిధుల కేటాయింపులు లేవు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదు. వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలి.’ అని హరీష్ డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ తోనే కరువు’
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ‘అధికారంలోకి వస్తే రూ.4 వేల పించన్ ఇస్తామన్నారు. కనీసం రూ.2 వేల పించన్ నెల నెలా ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు అమలయ్యేది ఎప్పుడు.?. మహిళలను మహాలక్ష్ములను చేస్తామన్న హామీ ఏమైంది.? ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని ఇవ్వడం లేదు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఇప్పటికీ రూ.16 వేల కోట్లు అప్పు చేసి.. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రూ.15 వేల రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంట్ పైన కూడా మాట తప్పారు. ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారు. మా మీద కక్షతో ప్రాజెక్టుకు, రైతులకు నష్టం చెయ్యొద్దు.’ అని హరీష్ వ్యాఖ్యానించారు.
Also Read: Ponguleti Srinivas: మార్చి 11 నుంచి ఐదో గ్యారంటీ, మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
మరిన్ని చూడండి