Kishan Reddy Slams Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని.. రాహుల్ గాంధీ కోసం బిల్డర్లను బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్ కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ (Telangana) నుంచి ఢిల్లీకి సూట్ కేసులు వెళ్తున్నాయని మండిపడ్డారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సనత్ నగర్ కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసులాంటివని.. ఆ రెండు పార్టీలు మజ్లిస్ అడుగుజాడల్లో పని చేస్తున్నాయని అన్నారు. ‘భద్రాచలం ఆలయం కోసం ప్రధాని మోదీ రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆయన కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న అతి ప్రాచీన, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీకే దక్కుతుంది.’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay : బీజేపీతో టచ్‌లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – బండి సంజయ్ కీలక ప్రకటన
మరిన్ని చూడండి