ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది
ఏపీ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను గుర్తించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిలో పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని, అహంకారంతో విర్రవీగి అసమర్థతతో వ్యవస్థలు నాశనం చేశారన్నారు. జగన్ పాలనలో మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్ లో పెట్టారని, మళ్లీ మంచి రోజులు ప్రారంభమయ్యాయని ఆశ వచ్చిందన్నారు. ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తైతే, కావాలని కాంట్రాక్టర్లు, అధికారులను మార్చారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.