విశ్వసనీయతకు మారుపేరు రామోజీ
“1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. అంతకముందు…తర్వాత అనేక చిట్ ఫండ్ సంస్థలు వచ్చాయి…కానీ మార్గదర్శి నేటికీ మార్గదర్శిగానే ఉంది. గత ప్రభుత్వాలు మార్గదర్శిపై ఎన్ని కుట్రలు చేసినా ఆ సంస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేకపోయారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన వారు ఆయనతో ఉన్నారంటే అది రామోజీ పట్ల ఉన్న వివ్వాసం, విశ్వసనీయత. 1969లో అన్నదాత మ్యాగ జైన్ తెచ్చి రైతులకు ఎనలేసి సేవలు చేశారు. 1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రికను విశాఖలో స్థాపించారు. 5 దశాబ్దాలుగా ఈనాడు పత్రిక ప్రజాచైతన్యం కోసం పని చేస్తోంది. 22 జిల్లా ఎడిషన్లు ప్రవేశపెట్టి వినూత్నమైన ఆలోచనతో ప్రజాసమస్యలను ఎండగట్టారు. రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం…అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తాం. కానీ రామోజీ పత్రికా రంగంలో ఉండి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడారు. 40 ఏళ్లుగా ఈనాడు నెంబర్-1గా ఉందంటే దాని వెనక రామోజీ కార్యదీక్షత, కృషి ఉన్నాయి. కొన్ని వందల మంది జర్నలిస్టులును, నటీనటులను, గాయకులను, కళాకారులను తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకేసారి 7 ఛానెల్స్ పెట్టి జయప్రదం చేశారు.’’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.