Raja Reddy with Priya Atluri Engagement Ceremony: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. ఈ వేడుకకు జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. వేడుక వద్దకు రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం జగన్ దంపతులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరి సీఎం జగన్, భారతి రెడ్డి దంపతులు రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
అయితే, వైఎస్ జగన్ వధూవరుల వద్దకు వచ్చి ఆశీర్వదిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫోటో దిగే సందర్భంలో జగన్ తన బావ బ్రదర్ అనిల్ ను, సోదరి షర్మిలను తన పక్కకు పిలుస్తుండగా.. వారు రాలేదు. జగన్ పదే పదే తన పక్కకు రావాలని సైగ చేస్తున్నప్పటికీ షర్మిల అక్కడికి వెళ్లలేదు. దీంతో షర్మిల, బ్రదర్ అనిల్ దూరంగా ఉండే ఫోటోల్లో కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కానీ, జగన్ వేదిక వద్దకు వచ్చిన సందర్భంలో మాత్రం.. షర్మిల ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఈ ఫోటోలు బయటికి వచ్చాయి.
గండిపేటలో నిశ్చితార్థం
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం జరిగింది. రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా కూడా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో రాజా రెడ్డికి గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వారు అప్పటి నుంచే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వారి మతాలు వేరు అయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించారు. అలా నేడు గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17న వీరి వివాహం జరగనుంది.