CM Revanth Reddy Laid Foundation Stone For Elevated Corridor: బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. గతంలో కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలు పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. హైదరాబాద్ – రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం అల్వాల్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందని.. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యం తన దృష్టికి వచ్చిందని అన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందని, ఈ కారిడార్ తో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని.. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని వివరించారు. ‘బీఆర్ఎస్ హయాంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయి. ప్రజా ప్రయోజనాల కోసమే ఓ మెట్టు దిగాను. రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం ఓ మెట్టు దిగినా తప్పులేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ఏదైనా శాశ్వత అభివృద్ధి చేశారా.?. అభివృద్ధి కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. వారు సహకరించకుంటే కొట్లాడుతాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు. తర్వాత అభివృద్ధే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.’ అని పేర్కొన్నారు.
‘కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి’
మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటున్నారని.. ఏం పోరాటం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టడమేనా.? అంటూ ఎద్దేవా చేశారు. ‘మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటంగా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటీఆర్ ఇందిరా పార్కు వద్ద ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకూ దీక్ష చేయాలి. ఆయన ఒకవేళ అలా దీక్షకు దిగితే మా కార్యకర్తలే ఆయనకు కంచె వేసి కాపాడతారు.’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఎలివేటెడ్ కారిడార్ పూర్తైతే..
రాజీవ్ రహదారిపై 11 కి.మీ పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటేడ్ కారిడార్ ను రూ.2,232 కోట్లతో నిర్మించనున్నారు. ఈ కారిడార్ పూర్తైతే.. హైదరాబాద్ నుంచి సిద్ధిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం కానుంది. అంతే కాకుండా మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంధనం మిగులుతో వాహనదారులకు వ్యయం తగ్గనుండగా.. నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం కలుగుతుంది.
ప్రత్యేకతలివే
కారిడార్ మార్గం: ప్యారడైజ్ జంక్షన్ – వెస్ట్ మారేడ్‌పల్లి – కార్ఖానా – తిరుమలగిరి – బొల్లారం – అల్వాల్ – హకీంపేట్ – తూంకుంట – ఓఆర్ ఆర్ జంక్షన్ (శామీర్‌పేట్)
☛ మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ, ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ, అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
☛ పియర్స్: 287, అవసరమైన భూమి: 197.20 ఎకరాలు, రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు, ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు.
మరిన్ని చూడండి