CM Revanth Reddy Slams Brs in Munuguru Meeting: తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో (Manuguru) నిర్వహించిన ‘ప్రజా దీవెన సభ’లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. ఇవి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని.. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేర్చలేదని.. కేసీఆర్ ను ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడూ నమ్మలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ అద్భుతమైన విజయాలు సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలేనని ప్రశంసించారు. ’18 ఏళ్లుగా ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలబడి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాతో రక్తసంబంధం లేకపోయినా పార్టీ గెలుపు కోసం మీ రక్తాన్ని చెమటగా మార్చి పని చేశారు. జిల్లాలో మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఖమ్మం నుంచే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాం. ఇచ్చిన మాట తప్పని నాయకురాలు సోనియాగాంధీ. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ తలుపు తట్టండి.. సోనియమ్మ మాటను ప్రతీ ఇంటికి చేరవేయండి.’ అని సీఎం పిలుపునిచ్చారు.
మరిన్ని చూడండి