MLA Vivek Attended ED investigation : చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదు అయింది. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థకు రూ.8 కోట్లు బదిలీ అయ్యాయి. ఎన్నికలసమయంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ కేసుల్లో సుదీర్ఘ విచారణ చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండ్రోజుల ముందు నవంబర్ 21, 2023న తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. గడ్డం వివేక్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. వివేకానంద బీజేపీని వీడి చెన్నూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాడులు జరిగాయి. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధులు ఎందుకు డిపాజిట్ చేయాల్సి వచ్చిందన్న దానిపై ప్రధానంగా ఈడీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. నిధుల డిపాజిట్లకు సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీకి చెందిన బ్యాంకు ఖాతా ద్వారా అసలు వ్యాపార హేతుబద్ధత లేకుండా డబ్బును బదిలీ చేయడం జరిగిందని గుర్తించారు.
డాక్టర్ జి వివేక్, ఆయన భార్య, వారి కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ విజిలెన్స్ సెక్యూరిటీతో రూ. 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు ED దర్యాప్తులో వెల్లడైందిని చెబుతున్నారు. సంస్థ తన తాజా బ్యాలెన్స్ షీట్‌లో కేవలం రూ. 20 లక్షలను ‘ఆపరేషన్ల నుండి వచ్చే ఆదాయం’గా ప్రకటించింది. ఇది ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు/అడ్వాన్స్‌ల విలువ రూ. 64 కోట్ల విలువైన ఆస్తులను నివేదించింది. ఆరంభం నుండి, కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో క్రెడిట్, డెబిట్ లావాదేవీలు రూ. 200 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. విజిలెన్స్ సెక్యూరిటీపై డాక్టర్ జి వివేక్ పరోక్ష నియంత్రణ ఉందని కూడా దర్యాప్తులో వెల్లడయినట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ED దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మరియు దాని మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్ ప్రాథమికంగా FEMA ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేల్చినట్లగా చెబుతున్నారు. దీని మెజారిటీ షేర్లు విదేశీ పౌరుడి వద్ద ఉన్నాయి. వివేక్ సంస్థను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు కూడా గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్ల ఫలితంగా డిజిటల్ పరికరాల రికవరీ, స్వాధీనం మరియు అనేక కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను సూచించే పత్రాలు అలాగే ఆస్తి ఒప్పందాలలో లెక్కించబడని నగదును గుర్తంచినట్లుగా ఈడీ చెబుతోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలు గ్రూప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇంటర్-కార్పోరేట్ డిపాజిట్లు చట్టబద్ధమైన వ్యాపారం లేని, భారీ భూ ఆస్తులను కలిగి ఉన్నాయని ప్రకటించింది. వాటిపై వివేక్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.