Darling Review: మూవీ రివ్యూ: డార్లింగ్


చిత్రం: డార్లింగ్
రేటింగ్: 1.75/5
తారాగణం: ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ, విష్ణు తదితరులు..
డైలాగ్స్: సాయి హేమంత్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ రాఘవ్
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
రచన – దర్శకత్వం: అశ్విన్ రామ్
విడుదల తేదీ: 19 జులై, 2024

హను-మాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వచ్చిన సినిమా. పైగా చిన్న సినిమా అని చూడకుండా భారీ స్థాయిలో ప్రచారం చేశారు. ఆ ప్రమోషన్ లో కొత్తదనం కూడా చూపించారు. ఇలా విడుదలకు ముందు అందర్నీ ఎట్రాక్ట్ చేసిన డార్లింగ్ మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రమోషన్ లో చెప్పినంత సినిమాలో ఉందా?

ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే రాఘవ్ (ప్రియదర్శి) కు చిరకాల కోరిక ఒకటుంది. పెళ్లి చేసుకొని ఎలాగైనా తన భార్యను హనీమూన్ కోసం పారిస్ కు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో తండ్రి ఓ సంబంధం చూస్తాడు. ఆమె సైకాలజిస్ట్. పేరు నందిని (అనన్య నాగళ్ల). ఇక ఆమెతో పెళ్లి అవ్వడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో నందిని హ్యాండ్ ఇస్తుంది. ఆఖరి నిమిషంలో ప్రేమించినవాడితో వెళ్లిపోతుంది.

దీంతో జీవితంలో విరక్తి చెందిన రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అతడి ప్రయత్నాన్ని ఆనంది (నభా నటేష్) ఆపుతుంది. తన పాజిటివ్ స్పీచ్ తో అతడి మనసు మారుస్తుంది. అదే టైమ్ లో ఆనందిని ఇష్టపడతాడు రాఘవ్. అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అతడు, ఆమెను కలిసిన 5 గంటల్లోనే ప్రపోజ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటాడు.

ఫస్ట్ నైట్ తో అసలు కథ మొదలవుతుంది. తను పెళ్లి చేసుకున్న ఆనందికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలుసుకుంటాడు. ఒకే వ్యక్తి ఐదుగురు విభిన్నమైన వ్యక్తుల్లా ప్రవర్తిస్తుందన్నమాట. దీంతో రాఘవ్ దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. ప్రతి రోజు ఆనంది, తన భర్తకు చుక్కలు చూపిస్తుంది. అసలు ఆనంది ఎవరు.. ఆమెకు ఆ సమస్య ఎలా వచ్చింది.. తన భార్యను రాఘవ్ తిరిగి మామూలు మనిషిగా ఎలా మార్చుకున్నాడు అనేది బ్యాలెన్స్ కథ.

స్టోరీ అంతా చెప్పేసినట్టు మీకు అనిపించినా లోపల చాలా దాచారు. కాకపోతే అలా దాచిన స్టఫ్ ఏదీ పెద్దగా ఆకట్టుకోదు. మరీ ముఖ్యంగా ఏ సినిమాకైనా అత్యంత కీలకమైన సెకండాఫ్, ఈ సినిమాకు మైనస్ గా మారింది. సెకండాఫ్ లో చాలా ఎపిసోడ్స్ సిల్లీగా అనిపిస్తాయి.

మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి చెప్పడానికి ప్రధాన పాత్రలు అపరిచితుడు లాంటి సినిమాల్ని ప్రస్తావిస్తాయి. అయితే అంత వివరణ అక్కర్లేదు. ఇలాంటి కథలు, పాత్రలు తెలుగు ప్రేక్షకులు చాలానే చూశారు. నేరుగా మేటర్ లోకి వెళ్లిపోతే బాగుండేది. ఇన్నాళ్లూ సీరియస్ గా చూసిన ఈ డిజార్డర్ ను ఈ సినిమాలో కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అన్నిచోట్లా ఈ ఎత్తుగడ సరైన ఫలితాన్నివ్వలేదు. ఉదాహరణకు హీరో ముద్దు అడిగిన ప్రతిసారి హీరోయిన్ లాగిపెట్టి కొడుతుంది.

ఆ తర్వాత ఇదే డిజార్డర్ ను హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ అనుబంధాన్ని పెంచడానికి, లైంగిక వేధింపుల సమస్యను ఎత్తిచూపడానికి వాడారు. అయితే ఇంటర్వెల్ తర్వాత ఈ ఫోకస్ మొత్తం మారిపోయినట్టు అనిపిస్తుంది. దర్శకుడు కొత్తకొత్త ఎలిమెంట్స్ జోడిస్తూ వెళ్లిపోయాడు.

అలా చివరికొచ్చేసరికి మొత్తంగా కథే పక్కదారి పట్టేసింది. ఇక సినిమాకు అత్యంత కీలకమైన హీరోయిన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే రుగ్మత ఎందుకొచ్చిందనే విషయాన్ని చెప్పిన తీరు, అక్కడొచ్చిన ట్విస్ట్ సమంజసంగా, సహేతుకంగా అనిపించదు.

దీనికితోడు హీరో పెళ్లికి, పారిస్ కు ముడిపెట్టడం కూడా పెద్దగా సింక్ అవ్వలేదు. ఆ కనెక్షన్ ను సినిమాలో చాలాసేపు బలవంతంగా కొనసాగించినట్టు అనిపించింది. వీటి వల్ల సినిమా కథ పక్కదోవ పట్టడంతో పాటు, ఒక దశలో గందరగోళంగా కూడా మారింది.

ఇక ఆఖరి ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత, ప్రారంభంలో చూపించిన ఓ సన్నివేశం అనవసరం అనిపిస్తుంది. హీరో పెళ్లి గురించి ఇచ్చే స్పీచ్ అవసరమా అనిపిస్తుంది. చీరల దుకాణంలో పెట్టిన మరో సుదీర్ఘమైన ఎపిసోడ్ సహనాన్ని పరీక్షిస్తుంది. నవ్వులు పూయించడానికి పెట్టిన చాలా సీన్లు వృధా అయ్యాయి. ఎడిటింగ్ టైమ్ లో హీరో, దర్శకుడు, నిర్మాత కూర్చొని ఇలాంటివి మాట్లాడుకుంటే రన్ టైమ్ కనీసం 10 నిమిషాలైనా తగ్గేది. ఇక సినిమా చివరి 40 నిమిషాలు పూర్తిగా గందరగోళానికి గురిచేస్తుంది. ‘డార్లింగ్’ ఫలితాన్ని గట్టిగా దెబ్బకొట్టే అంశం ఇదే.

ఇన్ని ప్రతికూల అంశాలున్నప్పటికీ ప్రియదర్శి వల్ల సినిమా చూడాలనిపిస్తుంది. చాలా చోట్ల బలహీనంగా ఉన్న సీన్స్ ను కూడా ప్రియదర్శి రక్తికట్టించాడు. ఈ పాత్ర అతడికి సరిగ్గా సరిపోయింది. బలగం, మల్లేశం సినిమాల్లో సీరియస్ రోల్స్ చేయడం వల్ల.. జాతిరత్నాలు లాంటి మిగతా సినిమాల్లో ప్యూర్ కామెడీ చేయడం వల్ల.. డార్లింగ్ లో ప్రియదర్శి పాత్రకు ఇట్టే కనెక్ట్ అవుతాం. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల చాలా చోట్ల ప్రియదర్శి కూడా హ్యాండ్సప్ అనాల్సి వచ్చింది.

ఇక సినిమాకు వెన్నెముక లాంటి పాత్ర పోషించిన నభా నటేష్, తన క్యారెక్టర్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయింది. 5 డిఫరెంట్ షేడ్స్ చూపించడం ఏ హీరోయిన్ కైనా కష్టమే. ఛాలెంజింగ్ రోల్ అయినప్పటికీ ఆడతుపాడుతూ చేశానని ప్రమోషన్స్ లో నభా చెప్పుకున్నప్పటికీ, సినిమాలో ప్రేక్షకుడు అంత ఈజీగా కొన్ని షేడ్స్ కు కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఉదాహరణకు ఫెమినిస్ట్ ఝాన్సీ పాత్ర.

చిన్న పాత్ర పోషించినప్పటికీ అనన్య నాగళ్ల ఆకట్టుకోగా.. ఇతర కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా ఫర్వాలేదనిపిస్తారు. ప్రియదర్శి స్నేహితులుగా నటించిన కృష్ణతేజ, విష్ణు ప్రత్యేకత చాటుకున్నారు.

టెక్నికల్ గా చూసుకుంటే ముందుగా నిందించాల్సింది దర్శకుడినే. అశ్విన్ రామ్ సరైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. అతడు ఎంతసేపు విషయాన్ని విడమర్చి చెప్పడానికే ప్రయత్నించాడు తప్ప, ఆ క్రమంలో రాసుకున్న సీన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయా అవ్వవా, అసలు కామెడీ రన్ టైమ్ ఎంత అని చెక్ చేసుకున్నట్టు లేదు. కనీసం ఎడిటర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా బాగుండేది. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ.. వివేక్ సాగర్ సంగీతంలో ప్రత్యేకత కనిపించలేదు.

ఓవరాల్ గా డార్లింగ్ సినిమా అస్తవ్యస్తంగా, అయోమయంగా అనిపిస్తుంది. చివరి గంట అయితే చుక్కలే. సినిమా డీసెంట్ గా మొదలై, కొన్ని కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నప్పటికీ, దర్శకత్వం లోపాల వల్ల ఆ వెంటనే పట్టాలు తప్పేసింది. ఓవైపు కామెడీ అందించేయాలి, మరోవైపు ఎమోషనల్ గా మంచి సందేశం కూడా ఇచ్చేయాలనే తపనలో దర్శకుడు తను దారితప్పి, ప్రేక్షకుల్ని కూడా దారితప్పేలా చేశాడు.

బాటమ్ లైన్- ఇక చాలు డార్లింగ్

The post Darling Review: మూవీ రివ్యూ: డార్లింగ్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment