దిశ, ఫీచర్స్: ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అంతం అయిపోతుందా?, యుగాంతం నిజంగానే వస్తుందా? ఒక్కసారిగా ఈ భూమిపై జీవజాలం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఆరుసార్లు అలాంటి పరిస్థితులు వచ్చిపోయాయని, మంచు యుగం అలాంటిదేనని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాసా సైంటిస్టులు మరో కొత్త రకం యుగాంతం వచ్చే అవకాశాలపై ఆందోళన చెందుతున్నారు. అదేంటో చూద్దాం.
ఊహకందని అపోఫిస్
అంతరిక్షంలో అనేక గ్రహశకలాలు (Asteroids) తిరుగుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్స్ – జూపిటర్ మధ్య కూడా అవి పరిభ్రమిస్తూ.. సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి. వాటివల్ల పెద్దగా ప్రమాదం కూడా ఉండదని సైంటిస్టులు చెప్తుంటారు. కాగా ప్రస్తుతం అంతరిక్షంలో తిరుగుతున్న ఓ గ్రహశకలం క్రమంగా భూమివైపు దూసుకొస్తోందని, 2029లో భూమికి చాలా దగ్గరగా వస్తుందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దానికి అపోఫిస్ (Apophis) అని పేరు పెట్టారు.
2024లోనూ ఒకసారి
అపోఫిస్ అంటే.. ఊహకందనిది అనే అర్థం కూడా ఉందట. ఈ గ్రహ శకలం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంకా తెలియనందున సైంటిస్టులు దానికి ఆ పేరు పెట్టారు. వాస్తవానికి ఈ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్న విషయాన్ని 2004లోనే కనుగొన్నారు. అప్పట్లో ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దాని పరిభ్రమణ సమయాన్ని, లక్షణాన్ని బట్టి తిరిగి 2029లో, 2036లో కూడా భూమికి సమీపించే అవకాశాలు ఉన్నాయి.
ప్రమాదం పొంచి ఉందా?
2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం వల్ల ప్రమాదంలేదనే అంచనాలు ఉన్నప్పటికీ, దాని పరిభ్రమణ వేగాన్ని, శక్తిని బట్టి శాస్త్రవేత్తలు ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే 350 మీటర్ల పొడవైన ఈ గ్రహశకలం ఓ పెద్ద నౌక అంత సైజులో ఉంటుంది. అది గనుక భూమిని ఢీకొడితే ఒక దేశం అంత విస్తీర్ణంలోని భూభాగం నాశనం అవుతుందని, పైగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఊపిరాడని పరిస్థితులు సంభవించే చాన్స్ ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు. ఒకవేళ భూమిని కాకుండా సముద్రంలో ఢీకొట్టినా అల్లకల్లోలాలు, సునామీలు రావచ్చు.
ఆరోజు ఏం జరుగుతుంది?
నాసా సైంటిస్టుల ప్రకారం.. అంతరిక్షం నుంచి భూమివైపునకు దూసుకు వస్తున్న అపోఫిస్ గ్రహశకలం 2029, ఏప్రిల్ 13న భూమిని సమీపిస్తుంది.. అంటే భూగోళానికి 32 వేల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. అప్పుడిది భూమిని ఢీకొడితే మాత్రం పెద్ద వినాశనమే జరుగవచ్చు. ఒకవేళ ఢీకొట్టకపోతే మరో వందేండ్ల పాటు ఏ గ్రహ శకలం భూమిని సమీపించే అవకాశం లేదు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఎందుకంటే మన శాటిలైట్లు భూమికి 20 వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. రాబోయే గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోయినా.. ఆ శాటిలైట్లను ఢీకొడితే అవి కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా భూమిపై కొంత నష్టం జరగవచ్చు.
సైంటిస్టులు అలర్ట్
అపోఫిస్ గ్రహశకలం భూమిని సమీపించేందుకు ఇంకా ఐదేండ్ల సమయమే ఉంది. ఇప్పటి వరకు వచ్చిపోయిన గ్రహ శకలాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. 2029, ఏప్రిల్ 13న అలాగే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రాబోయే గ్రహశకలాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంది. అట్లనే అది భూమిని ఢీకొట్టే పరిస్థితే గనుక తలెత్తితే దానిని అంతరిక్షంలోనే బ్లాస్ట్ చేసే టెక్నాలజీని కూడా నాసా సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. అయినప్పటికీ అపోఫిస్ సడెన్‌గా భూ వాతావరణంలోకి దూసుకొస్తే ఆటోమేటిగ్గా పేలిపోతుంది. అందుకే ఏం జరిగినా, జరగకపోయినా అప్రమత్తంగా అయితే ఉండాలనే ఉద్దేశంతో సైంటిస్టులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఒకవేళ అపోఫిస్ భూమిని ఢీకొడితే యుగాంతం తప్పదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది మాత్రం 2029, ఏప్రిల్ 13నే తేలనుంది.