Siddipeta Power Station Fire: ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా రాజకీయం చేయడం పరిపాటిగా మారింది. అనుకోకుండా జరిగే ప్రమాదాలనూ రాజకీయానికి వాడుకుంటున్నారు. సిద్దిపేట(Siddipet)లో పేలిపోయిన 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ రాజకీయానికి కేంద్రబిందువుగా నిలిచింది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి సబ్ స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా రావడం లేదని బీఆర్ఎస్ (BRS)విమర్శిస్తే.. గత ప్రభుత్వంలో చేపట్టిన నాసి రకం పనుల వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
పేలిపోయిన సబ్ స్టేషన్
సిద్దిపేట(Siddipet) పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పేలటంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక దాని తర్వాత ఒకటి పేలుతుండటంతో.. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలు అర్పేందుకు ప్రయత్నించాయి. మంటలు అదుపులోకి రాకపోవటంతో.. పక్కనున్న మండలాల నుంచి మరో మూడు ఫైర్ ఇంజిన్లను కూడా రప్పించారు. ట్రాన్స్ ఫార్మర్లు పేలిన శబ్దాలతో చుట్టుపక్కల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంతో.. సిద్దిపేట (Siddipet)మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది.అయితే ఈ ఘటనకు రాజకీయం రంగు పులుముకుంది. విద్యుత్ సరఫరా నిర్వహణలో కాంగ్రెస్(Congess) ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించాయి. కాంగ్రెస్ ను ఓడించిన సిద్ధిపేట(Siddipet) ప్రజలను చీకట్లో మగ్గపెట్టి ఆ పార్టీ పగ తీర్చుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట పట్టణంతోపాటు 5 మండలలాకు సరఫరా నిలిచిపోయిందంటూ మండిపడుతున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హరీశ్
సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలియగానే ప్రమాదం జరిగిన ప్రాంతానికి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)చేరుకున్నారు. చుట్టుపక్కల నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలను అదుపు చేయించారు. దాదాపు మూడు గంటల పాటు సబ్ స్టేషన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి మాట్లాడిన హరీశ్ రావు తక్షణం హైదరాబాద్ నుంచి విచారణ బృందాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సిద్ధిపేటకు చేరుకున్న తర్వాత వాళ్లతో మాట్లాడిన హరీశ్ రావు ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తక్షణం విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 5 మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్, ఫైర్, మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
అగ్ని ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్తాయని వీటికి ఎవరూ కారకులు కారని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్…రెండు నెలల క్రితం వరకు మీ పార్టీయే అధికారంలో ఉందని వారు ఎందుకు నిర్వహణ పట్టించుకోలేదని మండిపడింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి చౌకబారు విమర్శలు ఏంటని మండిపడింది.
మరిన్ని చూడండి