Huge competition for the Khammam Congress MP ticket : ఖమ్మం కాగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం భారీ పోటీ నెలకొంది. మొదట సోనియా గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రేసులో గట్టి పోటీ ఇస్తారనుకున్న రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు పోటీ అంతా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని మధ్య ఉంది. వీరిద్దరి కోసం ఇద్దరు మంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
భట్టి విక్రమార్క, పొంగులేటి మధ్య పోరాటంగా టిక్కెట్ రేస్
ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో భట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ హైకమాండ్ వద్ద గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారాలు చేసుకుంటున్నారు తే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం సీటు ఎవరకి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
ఖమ్మంలో విజయావకాశాలు ఎక్కువ !
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఏడు సెగ్మెంట్లనూ కాంగ్రెస్, సీపీఐ గెల్చుకున్నాయి. కొత్తగూడెం నుంచి సీపీఐ గెలవగా.. మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం నుంచి ఇప్పటివరకు 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. సీపీఎం రెండు సార్లు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి మాత్రమే గెలుపొందారు. రెండు దఫాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ బోణీ కొట్టింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఖమ్మంను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అన్ని సెగ్మెంట్లలో కలిపి రెండున్నర లక్షలకుపైగా మెజార్టీ కాంగ్రెస్ కు రావడంతో .. ఎవరు గెలిచినా విజయం ఖాయమని అనుకుంటున్నారు.
సీటు కోరుతున్న కమ్యూనిస్టులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల వ్యూహాలపై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఎన్నికలకు ముందు పొత్తు కుదరడంతో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు కలిసే పోటీ చేయనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీచేసిన సీపీఎం మాత్రం, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఉండే అవకాశముంది. ఇండియా కూటమిలో భాగంగా తమకు ఒక్క చోట అయినా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం చేసినా అంగీకరించామని గుర్తు చేస్తున్నారు.
మొత్తంగా ఖమ్మం సీటు కోసం.. ఓ రేంజ్ యుద్ధం కాంగ్రెస్ పార్టీలో జరిగే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని చూడండి