ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అయిదుసార్లు ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇరు జట్లకు విజయం కీలకం కావడంతో విజయం కోసం ఆసిస్.. పాక్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ వైపు అడుగు బలంగా వేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. ఒత్తిడిని ఎదుర్కొంటూ గెలుపొందాలని కంగారూలు, పాక్ జట్టు ప్రణాళిక రచిస్తున్నాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దాన్ని మరచిపోయి ఆసిస్‌పై గెలుపొందాలని బాబర్ సేన భావిస్తోంది. టీమిండియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పాక్.. తర్వాత టీమిండియా చేతిలో పరాజయం పాలైంది.
పాక్‌కు విజయం అత్యవసరం
మరోవైపు ఆసీస్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆసిస్ భారత్‌పై ఓటమితో కంగుతింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన లంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించడం కంగారూల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా-పాక్ 69 వన్డేలు ఆడగా అందులో 34 మ్యాచుల్లో కంగారూలు గెలుపొందారు. ప్రపంచ కప్‌లో పది మ్యాచ్‌లు అడగా అందులో ఆరు మ్యాచ్‌లు ఆసిస్ గెలవగా.. 4 మ్యాచుల్లో పాక్ గెలిచింది. ప్రారంభం నుంచి ధాటిగా ఆడుతూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలని పాక్ భావిస్తోంది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేయడం పాక్‌ను కలవరపెడుతోంది. ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్ భారీ పరుగులు చేయాలని బాబర్ సేన కోరుకుంటోంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పాక్ సారథి బాబర్ అజమ్ భారీ స్కోరు చేయకపోవడం మేనేజ్మెంట్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌పై అర్ధ శతకం చేసిన బాబర్… నెదర్లాండ్స్, శ్రీలంకపై తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ భారీ స్కోరు చేయాలని పాక్ భావిస్తోంది. మహ్మద్ రిజ్వాన్‌పై పాక్ ఎక్కువ ఆధారపడింది. నెదర్లాండ్స్‌పై అర్ధసెంచరీ చేసిన సౌద్ షకీల్, హార్డ్ హిట్టర్ ఇఫ్తికర్ అహ్మద్ భారీ స్కోర్లు చేయాలని పాక్ టీం మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. షాహీన్ షా అఫ్రిదిపై పాక్ బౌలింగ్ భారం ఉంది. ఈ టోర్నమెంట్‌లో షాహీన్ షా అఫ్రీదీ పెద్దగా రాణించలేదు. అఫ్రిది తన పేస్, స్వింగ్‌ను మళ్లీ అందుకుంటే ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు.
గాడిన పడాలని చూస్తున్న ఆసిస్
ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం సాధించింది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో కంగారూలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జోష్ ఇంగ్లిస్ మినహా మరే బ్యాట్స్‌మెన్ ఈ ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లిష్ మినహా మరే ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ 50 పరుగులు కూడా చేయలేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. ప్రపంచకప్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ మార్నస్ లబుషేనే. గ్లెన్ మాక్స్‌వెల్ (49) కంటే మిచెల్ స్టార్క్ (55), స్టీవ్ స్మిత్ (65), డేవిడ్ వార్నర్ (65) మిచెల్ మార్ష్ (59) అందరూ మూడు మ్యాచులు కలిపి వంద పరుగులు కూడా చేయలేకపోయారు. అయితే, పాకిస్థాన్ పై మరింత మెరుగ్గా ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు భావిస్తున్నారు. స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు.
ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్), సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం.