ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కి తెర లేచింది. నేటి నుంచి రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్… సిటీల వారీగా, ఫేవరెట్ క్రికెటర్ల వారీగా విడిపోనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా సూపర్ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగనుంది. ఈ సాలా కప్ నందే అంటూ బెంగళూరు జోరు మీదుంది. ఈ సీజన్‌కి చెన్నై జట్టులో పెద్ద మార్పు చేసింది మహేంద్ర సింగ్ ధోనీ బదులుగా రుతురాజ్‌గైక్వాడ్ చెన్నై జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రెండు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ గెలిచేది ఎవరంటూ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.
చరిత్ర చెన్నై వైపే…
ఐపీఎల్ టోర్నమెంట్‌లోనే తిరుగులేని జట్లుచెన్నై సూపర్‌కింగ్స్. టైటిల్ గెలవలేదు అనే ఒక్క అపవాదు తప్ప అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరిగితే చెన్నై 20 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. చరిత్ర ఇలా ఉన్నప్పటికీ ఆట మరోలా ఉంటుందని బెంగళూరు అంటోంది.
చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, మతీష పతిరాణా కీలక ఆటగాళ్లు. కిందటి సీజన్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన డెవాన్ కాన్వే లేకపోవడం లోటని చెప్పొచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ , దినేశ్ కార్తీక్, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్‌లను కీలక ప్లేయర్స్‌గా చెప్పవచ్చు. ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ బ్యాటింగ్ లైనప్ పైనే నమ్మకం పెట్టుకొంది.
నాయకుడు కాదు కానీ నడిపిస్తూ ఉంటాడు…
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ వదిలేశాడు కానీ అవసరమైనప్పుడు గైక్వాడ్‌కు గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. డీఆర్ఎస్‌ని ధోని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకొంటాడో అందరికీ తెలిసిందే. ఆ అనుభవం గైక్వాడ్‌కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడి ఉండటం దాదాపు సొంత మైదానమైన చెపాక్ లో పరిస్థితులు కొట్టిన పిండి కావడంతో మహేంద్ర సింగ్ ధోనీయే చెన్నైకి ప్రధాన బలం.
బీభత్సమైన బ్యాటింగ్
బెంగళూరు కూడా తేలిగ్గా మ్యాచ్ ఓడిపోయే రకం కాదు. బ్యాటింగ్‌లో డెప్త్ ఉన్న దృష్ట్యా దూకుడుగా ఆడేందుకే ఆర్సీబీ మొగ్గు చూపొచ్చు. బెంగళూరు జట్టుకు ప్రధాన బలం విరాట్ కోహ్లీనే. తనతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, కామెరాన్ గ్రీన్ లు ఎంత ప్రమాదకరమైన ఆటగాళ్లో అందరికీ తెలిసిందే. కానీ ఈ మైదానంలో కోహ్లీకి మంచి రికార్డ్ లేదు. బెంగళూరుకి కూడా ఇది అంతగా అచ్చొచ్చిన మైదానం కాదు. దీంతో ఆర్సీబీ అభిమానులు కలవరానికి గురవుతున్నారు.
స్పిన్ వైపే తిరగనున్న పిచ్…
చెపాక్ పిచ్ ఎప్పటినుంచో స్పిన్‌కు అనుకూలమని రికార్డులు చెబుతున్నాయి. మొదట బ్యాటింగ్‌కి చేసిన జట్టుకు పరిస్థితులు అనుకూలించే అవకాశాలున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. చెపాక్ మైదానం ఇప్పటికే పసుపు మయం అయిపోయింది. చెన్నై అభిమానులు స్టేడియం వద్దకు చేరుకొంటున్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న 2024 సీజన్ తొలిమ్యాచ్‌లో ఎవరు గెలిచినా టైటిల్ వేటలో వాళ్లు పంపే సిగ్నల్స్ చాలా బలంగా ఉంటాయి.