Chennai Super Kings MS Dhoni Ruturaj Gaikwad: హైదరాబాద్: రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అన్ని సీజన్లలో చూస్తే వీరిద్దరూ విజయవంతమైన కెప్టెన్లు. చెరో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలు ముద్దాడగా.. ధోనీ సారథ్యంలో సీఎస్కే సైతం 5 ఐపీఎల్ మెగా టైటిళ్లు కైవసం చేసుకుంది. ఆటతో పాటు కెప్టెన్సీలోనూ ఎవరికి వారే సాటి. వారితో వారికే పోటీ. కానీ ఇది కచ్చితంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనిపిస్తుంది.
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ.. ఒకరేమో తన సొంత నిర్ణయంతో, ఇంకొకరేమో మేనేజ్మెంట్ నిర్ణయంతో ఒకే ఏడాది ఐపీఎల్ కెప్టెన్సీ వదిలేశారు. ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ను పవర్ హౌజ్ ఫ్రాంచైజీలుగా మార్చిన ఆ ఇద్దరూ…. ఆఖరిసారిగా కెప్టెన్సీ చేసింది కిందటి ఏడాదే అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. గత సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ ధోనీ కెప్టెన్సీ కోసం ఎంతగానో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఇవాళ ధోనీ కెప్టెన్సీ వదిలేయటంతో నిరాశే మిగిలింది. అటు రోహిత్ కూడా అంతే. ఇండియా కెప్టెన్ గా ఉండగానే ముంబయి అతణ్ని… ఫ్రాంచైజీ కెప్టెన్ గా తొలగించింది.
వీరి లెగసీని ఎవరూ టచ్ చేయలేరు !
ధోనీ, రోహిత్ శర్మల లెగసీని ఎవరూ టచ్ కూడా చేయలేరు. అది అలాంటిలాంటి రికార్డులు, ఫీట్లు కావు. కేవలం ట్రోఫీలు మాత్రమే కాదు, ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఇద్దరూ ఎక్కడా ప్రెషర్ కు లొంగిపోకుండా జట్లను తమదైన శైలిలో నడిపించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2013, 2015, 2017, 2019, 2020 లో రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబయి టైటిల్స్ గెలిస్తే… 2010, 2011, 2018, 2021, 2023 లో ధోనీ నేతృత్వంలో సీఎస్కే ఛాంపియన్ గా నిలిచింది. అసలు ప్రస్తుతం ఉన్న కాంపిటీటివ్ టైమ్‌లో ఇన్నేసి ఏళ్లు ఎవరైనా కెప్టెన్ గా ఉంటారో లేదో, ఉన్నా సరే ఇన్ని టైటిల్స్ సాధించడం వీలవుతుందో లేదో అంటే… చాలా కష్టమే. ఐపీఎల్ లో వాళ్లు సృష్టించిన నిశ్శబ్ద తుపాను అలాంటిది. కెప్టెన్లుగా వీరిద్దరూ తప్పుకోవడంతో కచ్చితంగా ఐపీఎల్ కు సంబంధించి ఓ శకం ముగిసినట్టే. త్వరలోనే ఈ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని, వీరి అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని చూడండి