ఉచితంగా సేవలు – సీఎం జగన్
“ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం. కేన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోంది. ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుంది. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 15 నుంచి జరుగుతోంది. బీపీ , సుగర్, హిమోగ్లోబిన్ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు.అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారు.ప్రతి ఇంటికీ వెళ్లి… ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు.ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు.ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు.ఎక్కడ చికిత్స అందుతుంది? ఎలా వెళ్లాలి? ఏదైనా ఇబ్బంది ఉంటే.. ఎవర్ని సంప్రదించాలి? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందిస్తారు. ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్ చేయిస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనత పై ప్రత్యేక దృష్టిసారిస్తారు. గ్రామంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై వివరాలు అందిస్తారు.అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, వారికి కళ్లజోళ్ల ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న సురక్షలో ఇస్తారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నవారికి తదనంతర సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? ఈరెండు అంశాలపై కూడా సురక్షలో ప్రత్యేక దృష్టిలో పెడతారు” అని సీఎం జగన్ వివరించారు.