దిశ, ఫీచర్స్ : మనం రకరకాల స్వీట్లు తింటుంటాం. ప్రతిరోజూ టీ, కాఫీ, ఇతర పానీయాలు వంటివి తాగుతుంటాం. అయితే వీటిలో తీయదనం కోసం సాధారణంగా చక్కెరను కలుపుతుంటాం. వాస్తవానికి షుగర్ ఓ పరిమితికి మించితే ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కాబట్టి కొందరు దీనికి ప్రత్యామ్నాయంగా బెల్లం వాడుతుంటారు. అయితే దానిని తయారు చేసే ప్రాసెస్‌ను బట్టి చక్కెరకంటే బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.
* చెరుకు రసంతో: సాధారణంగా తినడానికి ఉపయోగించే బెల్లం ఎక్కువ శాతం చెరుకు నుంచే తయారు చేస్తారు. పొలంలో పండించిన చెరుకు గడలను తీసుకొచ్చి, వాటి నుంచి రసం తీసి, వడపోసి బాగా మరిగిస్తారు. బాగా పాకానికి వచ్చాక దానిని బయటకు తీసి అవసరమైన ముక్కలుగా, పొడిగా ప్యాక్ చేస్తుంటారు. ప్రజెంట్ మన దేశంలో ఎక్కువగా చెరుకుతో తయారు చేసిన బెల్లాన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో మరయూర్ బెల్లం కూడా చాలా ఫేమస్. ఇది కేరళ రాష్ట్రంలోని మరయూర్ పట్టణంలోనే తయారు చేస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా దీనిని కేవలం చెరుకు రసం నుంచే తయారు చేస్తారు.
* ఈత బెల్లం : ఈత బెల్లం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎవరూ వాడరు. కానీ పశ్చిమ బెంగాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారట. ఈతచెట్టు నీరాతో దీనిని తయారు చేస్తారు. అక్కడ దీనిని ఖజూర్ గుర్, నోలెన్ గుర్ అని కూడా పిలుస్తుంటారు. బెంగాల్ ఫేమస్ సంప్రదాయ స్వీట్లుగా పేర్కొనే సందేశ్, రసగుల్లాల తయారీలో దీనినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అన్ని రకాల పోషకాలు ఉండటంతో ఆరోగ్యానికి మంచిదని చెప్తారు.
* తాటి బెల్లం : మన దేశంలో తాటి బెల్లం కూడా మస్తు ఫేమస్. ఇందులో మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు, బికాంప్లెక్స్ ఫుల్లుగా ఉంటాయి కాబట్టి ఆహారంలో భాగంగా తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. దీనిని సహజమైన, పులియ బెట్టని తాటి నీరా నుంచి తయారు చేస్తారు. పోషకాలతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలు తినకుండా ఉండలేకపోతే చక్కెరికు బదులు తాటిబెల్లం తినాలని నిపుణులు సూచిస్తారు. దీంతోపాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి బెల్లాన్ని కూడా తయారు చేస్తారు. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల హెల్త్‌కి మంచిదని చెప్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాటి తయారీ ప్రాసెస్‌ను బట్టి చక్కెరకంటే బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే బెల్లంలోనూ రకాలు ఉన్నాయి. కాబట్టి ఏది మంచిది అనే సందేహం కూడా కొందరిలో వ్యక్తం అవుతూ ఉంటుంది. అన్ని రకాలు మంచివే.. కాగా తాటిబెల్లంలో మరిన్ని ఎక్కువ పోషకాలు ఉండటంవల్ల ఎక్కువ మంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తుంటారు.