సోషల్ మీడియా పోస్ట్‌లో ఏముందంటే..?
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచిన అనంతరం బుమ్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు వైరల్‌గా మారింది. మద్దతు వర్సెస్ శుభాకాంక్షలు అని అని రెండు ఫొటోలను కలిపి బుమ్రా పోస్టు చేశాడు. మద్దతు ఇచ్చేవాళ్లు తక్కువనే అర్థంలో స్టేడియంలో ఒక్కరే కూర్చున్న ఫొటోను ఉంచి… ఏదైనా సాధించిన తర్వాత శుభాకాంక్షలు చెప్పేవాళ్లు మాత్రం చాలా మంది ఉంటారనే కోణంలో స్టేడియం కిక్కిరిసిన ఫొటోను బుమ్రా షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాను దున్నేస్తోంది.
మూడో టెస్ట్‌కు దూరమేనా..?
రాజ్ కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రాను దూరం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.