ByGanesh
Tue 26th Mar 2024 04:34 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారణ, రెండు సార్లు కస్టడీకి తీసుకున్న ఈడీ.. మరోసారి కస్టడీ ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరగా.. ఏప్రిల్-09 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అంతేకాదు.. తీహార్ జైలుకు తరలించాలని ఈడీని ఆదేశించింది కోర్టు. దీంతో కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు కవితను ఈడీ అధికారులు తీసుకెళ్లారు. అంటే.. 14 రోజుల పాటు కవిత తీహార్ జైలులోనే ఉండబోతున్నారన్న మాట. అయితే.. కవిత రిమాండ్ ముగిసిన తర్వాత బయటికొస్తారా.. ఈ లోపే పర్మినెంట్‌గా జైలులో ఉండిపోతారా..? అని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. నేరం రుజువైతే మాత్రం మూడు నుంచి ఏడేళ్లపాటు కవితకు తీహార్ జైలు తప్పదని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు.
పరీక్షలంటే కుదరదు!
కాగా.. రెండు సార్లు కవితకు ఈడీ కస్టడీ ముగియగా మంగళవారం నాడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. బెయిల్ ఇవ్వాల్సిందేనని కవిత తరఫు న్యాయవాదులు.. విచారించాల్సింది ఇంకా చాలానే ఉందని కస్టడీకి ఇవ్వాలని ఈడీ.. ఇలా ఇరువైపులా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. చివరికి 14 రోజులకే ఓకే చెప్పింది కోర్టు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. దగ్గరుండి చదివించాల్సిన అవసరం ఉందని.. షెడ్యూల్‌తో సహా కోర్టుకు చూపించినప్పటికీ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం కుదరదని జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ బెయిల్ విషయం ఏప్రిల్-01న విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది. దీంతో కవితకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. అంటే.. పరీక్షలు అస్సలు కుదరదని పరోక్షంగా కవితకు కోర్టు చెప్పేసిందన్న మాట. అయితే ఏప్రిల్-01న అయినా కోర్టు నుంచి గుడ్ న్యూస్ వస్తుందని కవిత ఆశిస్తున్నారు. అంతా మంచే జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతన్నప్పటికీ లోలోపల మాత్రం టెన్షన్ తప్పట్లేదు.
కడిగిన ముత్యంలా..!
కవిత మాత్రం తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ.. ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని ధీమాగా కవిత చెప్పారు. అంతేకాదు.. తాను అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారామె. ఈ కేసు మనీలాండరింగ్ కాదని.. పొలిటికల్ లాండరింగ్ అంటూ కవిత ఒకింత సెటైర్లు వేశారు. అంతటితో ఆగని కవిత.. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులు ఒకరు బీజేపీలో చేరారని.. మరొకరి బీజేపీ టికెట్ ఇచ్చిందని.. ఇక మూడో నిందుడు రూ. 50 కోట్ల రూపాయిలు బీజేపీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కవిత ఎక్కడా తగ్గకుండా జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కోర్టులోకి వెళ్లారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ మీద.. తీహార్ జైలుకెళ్లున్నారు. అయితే.. ఇవన్నీ కాదు కవిత పర్మినెంట్‌గా జైలులో ఉండిపోతారని ప్రతిక్షాలు పెద్దఎత్తునే ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ విచారణలో కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టిందని.. త్వరలోనే తీహార్ జైలు కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మేక శరణ్‌ను కలిపి విచారణకు రంగం సిద్ధం చేస్తోంది ఈడీ. మరి రిమాండ్ తర్వాత కవిత విషయంలో ఏం జరగబోతోంది..? అనేదానిపై బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది.
K Kavitha Sent To Jail For 14 Days:
Kavitha was sent to judicial custody till April 9 by a Delhi court