Telangana News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల ముఖ్యమంత్రి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రమని సెటైర్లు వేశారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో 3ని రద్దు చేయడం వంటి డిమాండ్లతో ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని.. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా తమ హక్కుల కోసం ధర్నా చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని కవిత అన్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని కవిత విమర్శించారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని అన్నారు. జీవో 3 నిజమైతే 30 వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్ఫ్యూజ్‌లో ఉన్నారని అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడబోరని.. తమ పోరాటం మహిళలకే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదని అన్నారు.
ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం హైకోర్టులో ఏడాది నుండి కేసీఆర్ కొట్లాడుతుంటే… రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వెనక్కి తీసుకుంది? కొట్లాడాల్సింది పోయి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ జీవో3 అమలు చేస్తవా…? ఇదేక్కడి అన్యాయం… మహిళలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? ఆడబిడ్డను కడుపులనే సంపుతరు… పుట్టినా సదువుకోనియ్యరు… సదువుకోనిచ్చినా ఉద్యోగాలొచ్చుడు కష్టం… కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన బిడ్డ పీవీ ప్రధానిగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఆనాటి నుండి ఉన్న రిజర్వేషన్లకు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచింది. దీనిపై తిరగబడతాం… పోరాడి ఆడబిడ్డల హక్కులను సాధించుకుంటాం’’
‘‘ఆడబిడ్డలు కన్నీరు పెట్టడం మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు… కేసీఆర్ గారు పరీక్ష పెట్టి, ఫలితాలిస్తే మీరు నియామకపత్రాలిస్తున్న 30 వేల ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు దక్కాయి? శ్వేతపత్రం ఇస్తరా..? సుప్రీం తీర్పును కాదని కర్నాటక, బీహార్ ప్రభుత్వాలు 33శాతం ఇస్తుంటే మీరెందుకు ఇవ్వరు?’’ అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
మరిన్ని చూడండి
Source link