MLC Kavitha : ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేశారు. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేలా విడుదల చేసిన జీవో నంబర్ 3ను రద్దు చేయాలన్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్ మద్దతు తెలిపారు.
ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తూ గత నెల 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు కేటగిరీల్లో 100లో 33 శాతం(1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్లే
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు -1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వుడు కేటగిరిల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది. గ్రూప్ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
మహిళలకు అన్యాయం జరుగుతుందంటున్న కవిత
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్‌పీఎస్సీతోపాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
మరిన్ని చూడండి