ByGanesh
Sun 03rd Mar 2024 09:56 PM
వావ్.. మా పొలంలో మొలకలొచ్చాయ్ అని బీఆర్ఎస్ వాళ్లు కాలర్ ఎగురవేసే తరుణం.. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు..? అంటూ అధికార పక్షం.. తెలంగాణ ప్రజానీకం కళ్లు పెద్దవి చేసుకుని చూసే తరుణం ఇవాళ వచ్చింది. అదేంటంటారా? మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన్ను మీడియా సమావేశం చూసి కొన్ని నెలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతిన్నది.. ఇక సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో లైట్ తీసుకుంటే కష్టమని భావించారో ఏమో కానీ కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. బస్సు యాత్రలు చేద్దామంటూ తమ పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
పోటీ బీఆర్ఎస్, బీజేపీల మధ్యే..
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర కామెంట్ కూడా చేశారు. ఈ ఎన్నికల్లోనట… పోటీ అనేది బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. మరి గులాబీ బాస్‌కు ఇలాంటి కామెంట్స్ చేయక తప్పడం లేదు. లేదంటే కాంగ్రెస్‌కు మరింత హైప్ ఇచ్చినట్టు అయిపోతుంది. అలాగే పనిలో పనిగా కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కేసీఆర్ తమ ఖాతాలో వేసేసుకున్నారు. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. రైతులను రోడ్లపైకి తీసుకొచ్చారన్నారు. అలాగే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. శాసనసభ ఫలితాలను పక్కనబెట్టేసి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మునుపటి జోష్ ఎక్కడ?
పైగా బీఆర్ఎస్‌తో మేలు జరుగుతుందనే చర్చ జనాల్లో ప్రారంభమైందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించనున్నట్టు సమాచారం. గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో తమ పార్టీని విమర్శించిన బీఆర్ఎస్.. అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిందని.. ఆ మాట ప్రకారం ఉచితంగా చేయాలన్నారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని.. మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని కేసీఆర్ తెలిపారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించుకోవాలని కేసీఆర్ అన్నారు. మొత్తానికి కేసీఆర్‌లో మునుపటి జోష్ అయితే లేదు. మీటింగ్ చాలా సో సోగా సాగింది. ఏదో తప్పదన్నట్టుగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారని అనిపించింది.
KCR To Hold Key Meet In Telangana Bhavana:
BRS President KCR Reach The Telangana Bhavan