ByGanesh
Mon 25th Mar 2024 10:00 PM
అవును.. కూటమిని నమ్మి నిలువునా మోసపోయిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బంపరాఫర్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. కూటమి తరఫున టీడీపీ లేదా జనసేన.. బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ టికెట్ ఆశించిన ఆర్ఆర్ఆర్‌ను అస్సలు పట్టించుకోకుండా పక్కనెట్టేశారు. నిఖార్సయిన బీజేపీ నేత, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన శ్రీనివాస వర్మకు అగ్రనేతలు టికెట్ ఇచ్చారు. దీంతో నొచ్చుకున్న రఘురామ ఏం చేద్దాం..? అని ఆలోచనలో పడ్డారు. పైకి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పినప్పటికీ రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఊహకందని విషయం. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమా..? లేదంటే పార్టీలను పక్కనెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడమా..? అని అభిమానులు, అనుచరుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుండటంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారట. సరిగ్గా ఇదే సమయంలో కూటమి నుంచి స్వీట్ న్యూస్ వచ్చిందట.
ఇదే ఆ ఆఫర్!
వాస్తవానికి టీడీపీలో చేరితే అన్నీ చూసుకుంటానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. రఘురామకు ఆఫర్ ఇచ్చినప్పటికీ కారణాలేంటో తెలియదు కానీ కాదన్నారట. బీజేపీపైనే భారీగా ఆశలు పెట్టుకున్న ఆయనకు ఆఖరికి నిరాశే మిగిలింది. టికెట్ రాకపోతే కానీ రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో తెలియలేదు మరి. కూటమిలో భాగంగా 06 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. ఒకేసారి ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక మిగిలింది కేవలం అసెంబ్లీ అభ్యర్థులు మాత్రమే. పార్లమెంట్‌లో చోటు లేకపోవచ్చు కానీ.. అసెంబ్లీలో అయినా ఉంటుంది కదా అని రఘురామలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే కూటమి తరఫున గోదావరి జిల్లాల్లో ఏదో అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి చాన్స్ ఉంటుందని కూటమి హింట్ ఇచ్చిందట. ఇదేనట బంపరాఫర్. అంతేకాదు.. గెలిచినా ఓడినా సరే అసెంబ్లీకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సముదాయించారట.
అసెంబ్లీకే ఎందుకు..?
వైసీపీ ఓడినా, గెలిచినా ఆ పార్టీపై పోరాటం చేసేందుకు రఘురామను ముందుపెట్టాలన్నది చంద్రబాబు భావనట. ఎందుకంటే.. వైఎస్ జగన్ అన్నా.. వైసీపీ అన్నా ఆర్ఆర్ఆర్‌కు అస్సలు పడట్లేదు గనుక.. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్‌లో ఉండటమేంటి..? ఇక్కడే ఉండి వైసీపీ తీరును ఎండగట్టాలని మీ లాంటి వారు ముందుండాలని రఘురామకు గట్టిగానే నూరిపోశారట చంద్రబాబు. ఇలాగైతేనే వైసీపీని అడుగడుగునా నిలువరించే పరిస్థితి ఉంటుందని కూటమి అంచనా అట. అవసరమైతే మంత్రి పదవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమేనని హింట్ వచ్చిందట. దీంతో కాసింత రిలీఫ్ అయిన అసెంబ్లీకి పోటీచేయడానికి సిద్ధమయ్యారట. పైగా గెలిస్తే సరే.. ఓడితే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ రావడంతో ఇక ఆగడమెందుకు.. ముందుకెళ్తే పోలా అని రఘురామ భావించారట. ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ఇలా ఉంది మరి.. ఇందులో నిజానిజాలెంత..? రఘురామ మనసులో ఏముంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Kutami Bumper Offer to Raghurama:
Raghurama, who had high hopes on BJP, was left disappointed