లోకేష్ ఫోన్ ట్యాప్ చేయడానికి ట్రై చేసిందెవరు..?
ఏపీలోనూ రచ్చ లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..ఫోన్ ట్యాపింగ్.. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ట్యాపింగ్ ఎక్కువైంది. ఓ వైపు ఎన్నికల వేడి.. మరోవైపు నేతల ఫోన్ల ట్యాపింగ్ తో రచ్చ రచ్చగా ఉంది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పటికీ లెక్క తేలలేదు. ఆఖరికి కారు పార్టీ రోడ్డున పడిన పరిస్థితి. ఇప్పుడు ఇది ఏపీకి పాకింది.
ఎవరి పని!!
టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ అయ్యిందంటే అది మామూలు విషయం ఏమీ కాదు. లోకేష్ ఫోన్ ట్యాప్ చేయడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీనే
లోకేష్ కు తెలియజేసిందట. గుర్తు తెలియని సాఫ్ట్‌వేర్‌లతో ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరిగిందని.. ఇందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు, సూచనలు మెయిల్ ద్వారా లోకేష్ కి సదరు యాపిల్ కంపెనీ తెలియజేసింది. ఇదంతా అధికార పార్టీ పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నిజంగానే జరిగిందా.. లేకుంటే మంగళగిరిలో సింపతీ కోసమే ఇలా చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. చేస్తే.. గీస్తే బడా నేతల ఫోన్లు చేస్తారు కానీ మంగళగిరికి పరిమితమైన లోకేష్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలని ట్రై చేస్తారు అనే సందేహాలు కూడా సామాన్యుల నుంచి వస్తున్నాయ్.
తర్వాత ఏంటి..?
తెలంగాణలో అధికారం ఉండగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. బద్నాం చేయడానికి గులాబి నేతలు చేసిన అతి పెద్ద తప్పు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీసిన రేవంత్.. గులాబి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా.. టీడీపీపై కుయుక్తులు పన్నుతోందని టీడీపీ ప్రధాన ఆరోపణ. తాడేపల్లి వేదికగా ఇదంతా జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.