ByMohan
Tue 30th Jan 2024 11:15 AM
సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మహేష్.. సెన్సేషనల్ దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేయబోతోన్న విషయం తెలిసిందే. SSMB29గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా సిద్ధం అవుతున్నాయి. యాక్షన్ అడ్వంచర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ శాతం జర్మనీలో షూటింగ్ జరుపుకోనుంది. అందుకోసమే మహేష్ అక్కడి వాతావరణానికి అలవాటుపడేందుకు ముందుగానే అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం జర్మనీలో ఉన్న మహేష్ అక్కడ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా మహేష్ షేర్ చేశారు. డాక్టర్ హ్యారీ కోనిగ్‌తో కలిసి బ్లాక్ ఫారెస్ట్‌లో ఇలా గడ్డ కట్టే చలిలో ట్రెక్కింగ్ అంటూ మహేష్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జర్మనీలోని బాడెన్ అనే ప్రాంతంలో మహేష్ ట్రెక్కింగ్ చేసినట్లుగా ఇందులో చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలను చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ.. సాహసం చేయాలంటే కృష్ణగారి తర్వాత మీరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ చేసిన ఈ పోస్ట్‌కు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా స్పందించారు. నిన్ను ఎంతో మిస్సవుతున్నాం అంటూ ఆమె తెలిపారు. ఇక రాజమౌళితో సినిమా అంటే.. ఆ మాత్రం ముందస్తు కసరత్తులు ఉంటాయనే విషయం ఇప్పటికే ఆయన సినిమాల విషయంలో చాలా చూశాం. బాహుబలికి ప్రభాస్, రానా.. ఆర్ఆర్ఆర్‌కు చరణ్, తారక్‌లు ఎలా ప్రిపేర్ అయ్యారో ప్రత్యక్షంగా ఫ్యాన్స్ కూడా చూసి ఉన్నారు. ఇప్పుడు మహేష్ వంతొచ్చింది. ఈ సినిమాతో మహేష్ స్టార్‌డమ్ ఎలా మారబోతుందో అని ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Mahesh Babu Trekking for SSMB29 at Germany:
Mahesh Babu Preparing for SSMB29