Mallareddy says that he met DK Sivakumar at a private function : మాజీ మంత్రి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. ‘‘బెంగళూరులో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను కలిశా. అందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతా. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని స్పష్టం చేశారు. అధిష్ఠానం అవకాశమిస్తే మల్కాజిరిగి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి చెప్పారు. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తన కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు.
అయితే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. అయితే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది.దీంతో ాయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మల్లారెడ్డి , ఆయన కుమారుడు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిశారు. ఈ ఫోటో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు. తర్వాత మల్లారెడ్డి అల్లురు మర్రి రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కట్టిన ఇంజినరింగ్ కాలేజీ భవనాలను కూలగొట్టారు.
మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే మల్లారెడ్డి కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతతో రాయబారం నడిపానని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంగీకరించారని ఆయన చెబుతూ వస్తున్నారు. గతంలో ఎంపీగా, మంత్రిగా మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకొని భూములను కారు చౌకగా తన పేరిట, అనుచరుల పేరిట కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై వరుసగా నోటీసులు వస్తూండటంతో ఆందోళన చెందుతున్నట్లుగా చెబుతున్నారు.
మరిన్ని చూడండి