మంగళవారం అవార్డుల వేట మొదలైంది.. అవును అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాను జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో 4 అవార్డులు వరించాయి. మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100తో దర్శకుడిగా తనెంటో నిరూపించుకున్న అజయ్ భూపతికి రెండో సినిమా మహాసముద్రం మాత్రం అనుకున్న సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. దీంతో డీలా పడకుండా.. కసిగా మూడో సినిమా మంగళవారం చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంతో పాటు.. అజయ్ భూపతి పేరును కూడా నిలబెట్టింది.
కథగానే కాకుండా టెక్నికల్‌గానూ ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులని అలరించింది. మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను అని అజయ్ భూపతి.. సినిమా సక్సెస్ మీట్‌లో చెప్పినట్లే.. ఇప్పుడీ సినిమాకు జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో 4 అవార్డులు గెలుచుకోవడం.. చిత్రయూనిట్‌కు మరింత ధైర్యాన్నిచ్చినట్లయింది. ఈ ఫెస్టివల్‌లో మంగళవారం సినిమాకు ఏయే కేటగిరీలలో అవార్డులు వచ్చాయంటే..
1. ఉత్తమ నటి – పాయల్ రాజపుత్
2. ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్
3. ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్
4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్ అవార్డులను గెలుచుకున్నారు.
మంగళవారం సినిమా థియేటర్లలోనే కాకుండా.. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై.. అక్కడ కూడా మంచి ఆదరణను పొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాతలు కాగా.. పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ వంటివారు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.