సమ్మక్కతో కలిసి వీరోచిత పోరాటంసమ్మక్క–సారలమ్మల చరిత్రపై వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా కొంతమంది చరిత్రకారులు చెబుతున్న ప్రకారం.. క్రీ.శ.12వ శతాబ్ధంలో ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుడు రాజ్యకాంక్షతో పగిడిద్దరాజుపై దండెత్తుతాడు. యుద్ధపోరులో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందగా.. పరాజయ భావంతో జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాటం చేయగా.. కాకతీయుల సైన్యాధిపతి అయిన యుగంధరుడు వెనుకనుంచి వచ్చి పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క సైన్యానికి చిక్కకుండా అడవిలోకి వెళ్తుంది. చిలకలగుట్ట వైపు వెళ్లిన సమ్మక్క కోసం గిరిజనులు ఎంత వెదికినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ చెట్టు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర కుంకుమ భరిణె కనిపించింది. ఈ కుంకుమ భరిణెనే సమ్మక్కగా భావించి, అప్పటినుంచి గిరిజనులు జాతర చేసుకోవడం ప్రారంభించారు. కాగా యుద్ధంలో సమ్మక్కకు అంగరక్షకులుగా గట్టమ్మ తల్లి, సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు ఉన్నారు. కాగా గట్టమ్మ తల్లి ధైర్య, పరాక్రమాలతో శత్రువులతో సమ్మక్కతో పాటు వీరోచితంగా పోరాడింది. దీంతోనే ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసీ గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఘనమైన కీర్తి దక్కింది. సమ్మక్కకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి కొనసాగడం కూడా ఇందుకు కారణమైంది.
Source link