నందమూరి నటసింహం తెరపై కనిపిస్తే చాలు..
అశేష అభిమానులకి పూనకాలు పుట్టేస్తాయ్.
నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెబితే చాలు..
అసంఖ్యాక ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్ వచ్చేస్తాయ్.
అదే జాతర మరోసారి జరుగుద్దంటూ
ఇంకోసారి బాక్సాఫీసు బద్దలవడం తద్యమంటూ
హింటిచ్చే హంటింగ్ చూపించింది NBK109 గ్లింప్స్.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరస విజయాలతో హ్యాట్రిక్ చేసి మాంచి జోరుమీదున్న బాలయ్య – లాస్ట్ ఇయర్ వాల్తేర్ వీరయ్య తో మెగా బ్లాక్ బస్టర్ కొట్టి జోష్ లో ఉన్న పవర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో NBK109 ప్రకటించగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఆ కలయికపై ట్రేడ్ సర్కిల్స్ లోను గట్టి ఆశలు నెలకొన్నాయి. వాటన్నిటికీ ధీటుగానే బాలయ్య ధాటిని తెరపైకి తెస్తోంది NBK109 అని ప్రూవ్ చేసింది నేడు శివరాత్రి కానుకగా విడుదలైన స్పెషల్ గ్లింప్స్.
శివరాత్రి కానుక అని కేవలం వాక్యాన్ని వాడెయ్యలేదు.. నిజంగానే శివతాండవం చేసేసారు బాలయ్య. ఏంట్రా వార్ ప్రకటిస్తున్నావా అని అవతలివైపు నుంచి ప్రశ్న ఎదురైతే.. సింహం నక్కల్ని వేటాడితే అది యుద్ధం అవదురా లఫూట్.. ఇట్స్ హాంటింగ్ అంటూ విరుచుకుపడి బాలయ్య చేసిన విధ్వంసాన్ని చూస్తే అభిమానులు వెర్రెక్కిపోతారు, ప్రేక్షకులు కిర్రెక్కిపోతారు. కథ గురించో, కేరెక్టర్ గురించి ఏమాత్రం రివీల్ చెయ్యకుండా ఒకే ఒక్క ఫైట్ సీక్వెన్స్ తో గ్లింప్స్ కట్ చేసి గూస్ బంప్స్ తెప్పించేసాడు దర్శకుడు బాబీ.
దీనితో పాటు చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకమైన అంశం.. వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవి ఫాన్స్ ని ఉత్సాహపరిచేలా ఆయన ఓల్డ్ మెగా టైటిల్ కార్డు ని మరోమారు తెరపైకి తెచ్చిన బాబీ ఈసారి బాలయ్య ఫాన్స్ ని ఉర్రుతలూగించేలా ఆయన పేరుకే ఓ సరికొత్త డిఫినిషన్ ఇచ్చారు. NBK అంటే Naturally Born King అంటూ టైటిల్ కార్డు వెయ్యడం నందమూరి ఫాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా బాగా ఇంప్రెస్ చేసేలా ఉంది. అలాగే గ్లింప్స్ లో అందరికి బాగా నోటెడ్ అయిన బాలయ్య బ్రాండ్ బాటిల్ ని చూపిస్తూనే, ఆయన స్థాయికి తగ్గ డైలాగులు పలికిస్తూనే, రేపనే రోజున నట సింహం చేసే వేట, ఆడే ఆట ఎలా ఉండబోతుందో టేస్ట్ చూపించేసారు. బాక్సాఫీసుని టెస్ట్ కి సిద్దమవ్వమన్నారు.
ఇక కంక్లూజన్ కి వస్తే మన తెలుగు సీనియర్ హీరోలు కమల్ హాసన్ విక్రమ్ లాగా, రజినీకాంత్ జైలర్ లాగా ఎందుకు చేయలేకపోతున్నారు అనే వాదనకి సమాధానంగా నిలుస్తున్నాయి ఇటీవల వస్తున్న బాలకృష్ణ చిత్రాలు. అఖండలో అఘోరాగా కనిపించినా, వీరసింహారెడ్డిలో వయసు పెరిగిన ఫ్యాక్షనిస్ట్ గా కనిపించినా.. భగవంత్ కేసరిలో వయసులో ఉన్న అమ్మాయికి తండ్రిని తానే అనిపించినా బాలయ్యకే చెల్లింది, ఆ ఘనత బాలయ్యకే దక్కింది. NBK109 లో కూడా బాలకృష్ణ పోషిస్తుంది తన వయసుకు తగ్గ పాత్రనే, చేస్తోంది నేటి ట్రెండ్ కి తగ్గ యాక్షనే.!