ByGanesh
Sat 29th Jun 2024 09:57 PM
అవును.. అంతా అనుకున్నట్లే జరిగిపోతోంది..! కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ కీలకమైన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల వల్లే ఎన్డీఏ ఈ పరిస్థితుల్లో ఉంది.. లేదంటే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో..! ఆ సంగతి అలా ఉంచితే.. ఈ రెండు పార్టీల చేతిలో మోదీ జుట్టు ఉంది గనుక చంద్రబాబు, నితీశ్ కుమార్ ఏం చెప్పినా ఇప్పుడు అక్షరాలా జరుగుతుంది. అందుకే.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా పూర్తి కాకమునుపే మోదీ సర్కార్‌కు గట్టి మెలిక పెట్టింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. పార్టీ సమావేశంలో తీర్మానం చేసింది. ఒకవేళ హోదా ఇవ్వలేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానానికి జేడీయూ ఆమోదం కూడా లభించింది.
ఇదొక కీలక దశ!
వాస్తవానికి.. బీహార్‌కు ప్రత్యేక హోదా అడగటం ఇదేమీ తొలిసారి కాదు. రాష్ట్రాభివృద్ధి పథాన్ని వేగవంతం చేయడానికి, సవాళ్లను పరిష్కరించడంలో ఇదో కీలక దశ కావడం, దీంతో పాటు కేంద్రంలో జేడీయూ కీలకం కావడంతో తాము ఏం చెప్పినా నడుస్తుందని ఈ డిమాండ్ తెరపైకి తెచ్చినట్లు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే.. నితీశ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా ప్యాకేజీ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇదిలా ఉంటే.. బీహార్ వెనుకబడిన రాష్ట్రమన్నది అందరికీ తెలిసిందే. అందుకే.. రాష్ట్రాభివృద్ధి కోసం పదే పదే ఇలా హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఇప్పుడిక నితీశ్ సమయం చూసుకుని కేంద్రంపై ఆట మొదలుపెట్టారు. మోదీ సర్కార్ నుంచి ఏ మాత్రం నిధులు నితీశ్ రాబడుతారో మరి.
బాబు అడిగేదెప్పుడో..?
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో నితీశ్ కుమార్ ఎంతో.. చంద్రబాబు అంతకుమించే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో పాటు.. రాష్ట్రంలోనూ టీడీపీ కూటమి ఉంది. పైగా 16 మంది ఎంపీలు ఉండటంతో చంద్రబాబుది కీ రోల్. దీంతో.. ఇప్పుడు చంద్రబాబు ఏం అడిగినా మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనరన్నది జగమెరిగిన సత్యమే. సరిగ్గా ఇప్పుడు నితీశ్ ఆట మొదలుపెట్టారు కాబట్టి.. ఏపీ సీఎం కూడా షురూ చేయవచ్చు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. రాజధాని లేని రాష్ట్రంగా పదేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు రాజధాని నిర్మించడంతో పాటు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు ఎంతో శ్రమించాల్సి ఉంది. అందుకే.. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి హోదా అడిగి.. తీసుకుంటే మాత్రం ఏపీ నిలబడుతుందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి.. చంద్రబాబు మనసులో ఏముందో.. ఇంత మంది ఎంపీలు, కేంద్రంలో భాగస్వామ్యం అయ్యుండి కూడా మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.
Nitish Kumar repeats special status demand:
Will Nitish Kumar walk the talk on special status for Bihar