భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. పసికూనలపై అగ్ర జట్లు భారీ స్కోర్లు నమోదు చేసి ముందుకు సాగుతుండగా.. ప్రధాన జట్లు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లే పూర్తవ్వగా అప్పుడే 11 శతకాలు నమోదయ్యాయి. ఒకే జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్లే కాకుండా ముగ్గురు కూడా సెంచరీలు చేసి ఈ ప్రపంచకప్‌లో హోరాహోరీ పోరుకు తెరలేపారు. ఇప్పటివరకూ నమోదైన మ్యాచ్‌లను ఒకసారి పరిశీలిస్తే…

కివీస్‌ బ్యాటర్లు చెలరేగిన వేళ….

ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ తలపడిన ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు నమోదయ్యాయి. గత ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన ప్రతీకారానికి కివీస్‌ గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది . డేవాన్ కాన్వే, వన్‌ డౌన్‌ బ్యాటర్ రచిన్‌ రవీంద్ర.. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌కు విజయం నల్లేరుపై నడకగా మారింది. కాన్వే ఊచకోతకు ఇంగ్లాండ్‌ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఎన్నిసార్లు బౌలింగ్‌ మార్చినా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడం బ్రిటీష్‌ బౌలర్ల తరం కాలేదు. కాన్వే 152, రచిన్‌ రవీంద్ర 123 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ల పరుగుల హోరు

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. 1975 నుంచి ప్రారంభమైన మెగాటోర్నీ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్‌ డెర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), అయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో లంకేయులను చీల్చిచెండాడారు. ఈ మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో లంక.. దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది.

ఇక మంగళవారం రెండు మ్యాచ్‌లు జరగగా ఒక్కరోజే ప్రపంచకప్‌లో అయిదు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ సెంచరీతో కదం తొక్కగా.. శ్రీలంక, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.

డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకం

ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్‌ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు. 107 బంతుల్లోనే 140 పరుగులు చేసి భారీ శతకం సాధించాడు. మలాన్‌ విధ్వంసంతో 137 పరుగుల తేడాతో బంగ్లాను బ్రిటీష్ జట్టు మట్టికరిపించింది.

ఒకే మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు

శ్రీలంక-పాకిస్థాన్‌ మధ్య ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శతకాల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక… కుశాల్‌ మెండీస్‌(122), సధీర సమరవిక్రమ(108) సెంచరీలతో 344 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ కూడా ఇద్దరు బ్యాటర్ల సెంచరీలతో లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్‌ రిజ్వాన్‌(131), అబ్దుల్‌ షఫీక్( 113) శతకాలు సాధించడంతో పాక్‌ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.

Source link
previous post