Patancheru Mla Mahipal Brother Arrested in Illegal Mining: అక్రమ మైనింగ్ ఆరోపణలతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని (Madhusudhan Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని లక్డారం గ్రామంలో సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో ఆయన క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని.. అనుమతుల గడువు ముగిసినా మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మధుసూదన్ పై అక్రమ మైనింగ్, ఛీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి.. క్రషర్లను సీజ్ చేశారు. అయితే, ఆయన్ను తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తూ పోలీసులను అడ్డుకున్నారు. వారిని నిలువరించిన పోలీసులు మధుసూదన్ ను సంగారెడ్డి తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు యత్నించగా ప్రధాన ద్వారం మూసేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మరోవైపు, మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ తీరును ఖండించారు. దేశం మొత్తంలో ఎన్నో క్వారీలున్నాయని.. పూర్తి అనుమతితోనే తమ క్వారీలు నడిపిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ‘ప్రజల మద్దతుతో కింది స్థాయి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. నా సోదరున్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం.’ అని స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి