తాజాగా తనకు అభిమానులు, జనసైనికులు రాసిన కొన్ని లేఖలను ట్విట్టర్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసి వాటిపై రియాక్ట్ అవుతున్నారు. ఉదయం ఐర్లాండ్‌లో ఉన్న ఒక ఓడకళాసి లేఖపై ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా మరో లేఖ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ లేఖ 2019 ఎన్నికలలో నా ఓటమి తర్వాత వచ్చింది. కష్ట సమయంలో నాకు నిబద్ధత కలిగిన జనసైనికుల మద్దతు లభించినందుకు ఆనందంగా ఉంది. వారి పట్టుదల చూస్తుంటే వారెంత స్ఫూర్తిదాయకంగా అడుగులు వేస్తున్నారనేది నాకు అర్థమవుతోంది. ఈ లేఖ రాసిన గ్రూప్ లీడర్.. ఈ లేఖతోనే ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో యుఎస్ నుండి వచ్చి, అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాడు. ఆచంట నియోజకవర్గం రామన్న పాలెం MPTC స్థానంలో 144 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయ స్ఫూర్తి చాటాడు. మనమంతా భౌతికంగా ఒకరికొకరం దూరంగా ఉన్నప్పటికీ, మన హృదయాలు సామాజిక న్యాయం పట్ల అదే ఉత్సాహంతో మరియు నిబద్ధతతో ఉంటాయని చాటి చెప్పారు.. అని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక ఈ లేఖలో
పవనన్నా..
అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందరికి ఒకటే చెప్తున్నాం. మేము అవినీతి డబ్బుతో ఓట్లు కొనలేదు. మందు పొయ్యలేదు, గూండాయిజమ్ చేయలేదు అని..
నువ్వు చేసిన దిశానిర్దేశంతో నువ్వు నిలబెట్టిన అభ్యర్థులని ప్రచారం చేశాం. నువ్వు పెట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం.
వారి డబ్బు, మందు, దాదాగిరీ మీద మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఇది ఇలా కొనసాగనివ్వమని మాకు తెలుసు. మా మొదటి అడుగు పడింది. ఇంకో 5 సంవత్సరాలలో ఇది 100 అడుగులకి చేరుస్తామన్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది. కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందం.. మన పార్టీని ఇంకా బలపరుస్తాం.
ఈ ఓటమి కసిని నరనరాల్లో జీర్ణించుకుని 2024కి ఎగిసే కెరటమల్లే సిద్ధమవుతాం.. కోల్పోయిన దానిని తెచ్చుకునే వరకు విశ్రమించం.
గెలుపోటముల్లో నీవెంటే ఉన్నాం, ఉంటాం కూడా.. నిజాయితీని చూసి అవినీతి ఎంతో కాలం నవ్వదు. నువ్వు ఓడిపోయావ్ అన్న బాధకన్నా నిన్ను గెలిపించుకోలేకపోయాం అనే ఆవేదనని దిగమింగుకుని.. మన పార్టీకి కావాల్సినవి లైక్లు, షేర్లు కాదని తెలుసుకున్నాం..
వదిలేది లేదు అన్నా.. మమ్మల్ని నడిపించు.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్పించు.. మా జీవితంలో ఏం మారినా సరే, మేము పట్టుకున్న జెండా ఎప్పటికీ మారదు.. కట్టె కాలే వరకు నీతోనే ఉంటాం.
రెట్టించిన విశ్వాసంతో
నీ జనసైనికులు.. అని రాసి ఉంది.