Actor Babu Mohan joins Praja Shanthi Party: హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు పొత్తులపై ఫోకస్ చేస్తున్నాయి. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. టీడీపీ, జనసేన ఇప్పటివరకూ పొత్తులో ఉండగా.. తాజాగా బీజేపీ చేరికతో మూడు పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్తున్నాయి. లోక్ సభ ఎన్నికలకుగానూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా బరిలోకి దిగుతోంది. బీఆర్ఎస్, బీఎస్పీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. బీజేపీ ఇదివరకే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కసరత్తులో దూకుడు పెంచింది. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (Praja Shanti Party chief KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కెఏ పాల్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేస్తున్నానని కేఏ పాల్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము అడ్డుకుంటామని, అందుకు ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పొత్తు పొట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని కేఏ పాల్ వెల్లడించారు.
ప్రజాశాంతి పార్టీ నేత బాబు మోహన్ బీజేపీపై ఆరోపణలు చేశారు. బీజేపీ తనను గత 5సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ బీజేపీ పరిశీలన లిస్టులో తన పేరు లేకుండానే కేంద్రానికి పంపారని బాబు మోహన్ తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏ పాల్ తో కలసి పనిచేయాలని భావించి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కేఏ పాల్ నేతృత్వంలో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి, దేశానికి, రాష్ట్రానికి ఆయన సేవలు అందే విధంగా కృషి చేస్తానని బాబు మోహన్ పేర్కొన్నారు.
అవినీతి పార్టీ కంటే ప్రజాశాంతి పార్టీ బెటర్ !
వైసీపీ అంటే అవినీతి పార్టీ అని, వారి అవినీతి ఆకాశాన్ని అంటుకుందని కేఏ పాల్ ఆరోపించారు. బండలు, గుట్టలు, కొండలు ఏదీ వదలకుండా అన్నీ అమ్మేశారని.. చివరికి రాష్ట్ర సచివాలయం బిల్డింగ్‌ను తాకట్టు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని.. అలాంటి వైసీపీ పార్టీలో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేరడం సరికాదన్నారు. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే, అవినీతి పార్టీ వైసీపీకి బదులుగా ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. బాబు మోహన్ బాటలో నడుస్తూ తమ పార్టీలో చేరితే సంతోషమన్నారు. కోట్ల రూయాయలకు అమ్ముడుపోయారని కొందరు ముద్రగడపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో మీకు, మీ కుమారుడికి సీట్లు ఇస్తామని, మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా సైతం ప్రకటిస్తామని ముద్రగడకు కేఏ పాల్ ఆఫర్ చేయడం తెలిసిందే.
మరిన్ని చూడండి