India vs England R Ashwin’s wife Prithi Naray: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్(Rajkot) వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో అశ్విన్ (Ravichandran Ashwin) 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే అతని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో రవిచంద్రన్ అశ్విన్ ఆ అద్భుతాన్ని అంతగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. మ్యాచ్ మధ్యలోనే ఇంటికి బయల్దేరాడు. రెండో రోజు ఆట అనంతరం చెన్నై వెళ్లిన అతను మూడో రోజు ఆట ఆడలేదు. మళ్లీ నాలుగో రోజు అంపైర్లు అనుమతితో బరిలోకి దిగాడు. కీలకమైన ఒక వికెట్ తీసి 501వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా చారిత్రాత్మకమైన విజయంలో భాగస్వామ్యమయ్యాడు. దాదాపు 48 గంటలపాటు అశ్విన్ తీరికలేని ప్రయాణంపై అతడి భార్య ప్రీతి నారాయణన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ లో ప్రీతి ” 500వ వికెట్ కోసం అశ్విన్ హైదరాబాద్ టెస్టులో ప్రయత్నించాడు. కానీ అక్కడ సాధ్యం కాలేదు. వైజాగ్ టెస్టులోనూ జరగలేదు. దీంతో అప్పటికే కొని ఉంచిన స్వీట్లను 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ మేము పంచిపెట్టాము. 500వ వికెట్ దక్కింది కానీ మేము మౌనంగా ఉండిపోయాం. 500 – 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. నిజంగా ఎంత అసాధారణమైన వ్యక్తి. అశ్విన్.. మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను అభిమానిస్తున్నాము!’’ అంటూ ప్రీతి నారాయణన్ అశ్విన్ ఫొటోను ఇంస్టాలో షేర్ చేశారు.
అశ్విన్ ఓ క్రికెట్ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్ ద్రావిడ్ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్ సిద్ధంగా ఉంటాడు. అలాగే కుటుంబానికి కూడా ప్రాధాన్యతను ఇచ్చిన అశ్విన్ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ తీసి టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని సాధించాడు. ఆ రోజు ఆట ముగిశాక తన తల్లికి బాగాలేదని తెలిసిన యాష్.. హుటాహుటిన చెన్నై వెళ్లాడు. తిరిగి నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి జట్టుతో చేరి.. బౌలింగ్ కూడా చేశాడు. టామ్ హార్ట్‌లీ వికెట్ తీసి 501వ వికెట్ కూడా ఖాతాలో వేసుకున్నాడు.
సుదీర్ఘ కెరీర్
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ అప్పటినుంచి టీమిండియాలో కీలక బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అషూ.. టాపార్డర్ బ్యాటర్‌గా తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించి తర్వాత స్పిన్నర్‌గా మారిపోయాడు. కుంబ్లే, హర్భజన్ సింగ్ యుగం తరువాత, అశ్విన్ మంచి స్పిన్నర్ గా రాణించాడు. తన మొదటి 16 టెస్టుల్లో అశ్విన్ తొమ్మిదిసార్లు ఐదు వికెట్లు తీసి అత్యంత వేగంగా 300 వికెట్ల క్లబ్‌లో చేరిన ఆటగాడిగా నిలిచాడు. తొలి మూడేళ్లలో అతను 23 టెస్టుల్లో 114 వికెట్లు పడగొట్టాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో 43 టెస్టుల్లో 252 వికెట్లు, విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లు సాధించాడు. భారత్‌లో అయితే అతనికి తిరుగేలేదు. 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు.సొంతగడ్డపై అతనాడిన 57 టెస్టుల్లో భారత్ 42 గెలిచింది. ఓవరాల్‌గా 97 టెస్టుల్లో 56 విజయాలు సాధించింది. 10 సార్లు అతను ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో 43 టెస్టుల్లో 252 వికెట్లు, విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లు సాధించాడు. భారత్‌లో అయితే అతనికి తిరుగేలేదు. 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు.