Telangnaa News: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు జోరుగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయగా, గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం అమలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే చర్యలను చేపట్టింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలను రేవంత్ రెడ్డి సర్కారు జారీ చేసింది.
దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వర్తించేలా
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందించాలని సీఎం నిర్ణయించారు. దసలవారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారి కోసం వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేయించింది. ఇందులో తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండనున్నాయి. ఈ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు 2024 – 25 మధ్యంతర బడ్జెట్లో రూ.7740 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల ప్రారంభం
ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాదులో బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే, ముందుగా యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ చేరుకుంటారు. శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా సీఎం ప్రారంభించిన అనంతరం భద్రాచలం వెళ్ళనున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం భద్రాచలం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ముగిసిన తరువాత సీతారామ ప్రాజెక్టుతోపాటు సాగునీటి రంగానికి సంబంధించిన ఇతర అంశాలు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత మణుగూరు చేరుకుని అక్కడ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం హెలిక్యాప్టర్ లో తిరిగి హైదరాబాదుకు సీఎం రేవంత్ రెడ్డి వెళతారు. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతోపాటు పార్టీ నాయకులు పూర్తి చేశారు.
మరిన్ని చూడండి