టీమిండియాకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మళ్లీ రంగంలోకి దిగాడు. డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్‌ దూరమయ్యాడు. అయితే డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న శుభ్‌మన్‌ మళ్లీ బ్యాట్‌ పట్టి రంగంలోకి దిగాడు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మైదానానికి చేరుకున్న గిల్‌… ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గిల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించిన పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 14న జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే గిల్‌ పూర్తి ఫిట్‌గా ఉంటే బరిలోకి దిగడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శుభ్‌మన్‌ మాత్రం పాకిస్థాన్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ శుభ్‌మన్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ స్టార్‌ ఓపెనర్‌ డెంగ్యూ జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నాడని… కానీ అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నదానిపైనే జట్టులోకి వస్తాడా లేదా అన్నది ఆధారపడి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డెంగ్యూ కారణంగా జట్టుతో పాటు అహ్మదాబాద్‌ రాకుండా చెన్నైలోనే ఉన్న గిల్‌.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. అంతరం చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్న గిల్‌ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు. గిల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తున్నాయి. శుభ్‌మన్‌ను తిరిగి ప్రాక్టీస్‌లో చూడడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే వేదికపై బరిలోకి దిగి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గిల్‌ చెలరేగిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం శుబ్‌మన్‌ పాక్‌తో మ్యాచ్‌లో ఆడడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గిల్ ఫిట్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవచ్చు. గిల్ ఆరోగ్య పరిస్థితిపై భారత బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాఠోడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ వేగంగా కోలుకుంటున్నాడని, ఎప్పటికప్పుడు వైద్య బృందం పర్యవేక్షిస్తూ ఉందని, త్వరలోనే గిల్‌ మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నామని రాఠోడ్‌ వెల్లడించారు. గిల్‌ ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు కోలుకున్నాడు. అయితే, ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టమని స్పష్టం చేశాడు. గిల్‌ అందుబాటులో లేకపోయినా భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగానే ఉందని, అనుభవం కలిగిన బ్యాటర్లు జట్టులో ఉన్నారని భారత బ్యాటింగ్‌ కోచ్ అన్నాడు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసన్న రాఠోడ్‌…. మైదానంలోకి దిగిన తర్వాత ఎలా ఆడాలనే స్వేచ్ఛ వారికి ఇచ్చామని, కాబట్టి కేవలం ఒక్కరి మీదనే టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ ఆధారపడదని తేల్చి చెప్పాడు.

అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్‌ నుంచి పూర్తిగా కోలుకోని గిల్ పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావడం కష్టమేనన్న అభిప్రాయమూ విశ్లేషకుల్లో నెలకొంది. దీంతో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ తర్వాత అహ్మదాబాద్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అక్టోబరు 19న పూణెలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఉంటుంది. గిల్‌ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రాకున్నా తర్వాతి మ్యాచ్‌లకు కచ్చితంగా జట్టులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు..

Source link