దిశ, ఫీచర్స్ : పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు నెలలు, సంవత్సరాల తరబడి అంతరిక్షంలో గడపాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వ్యోమగాముల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అందుకు నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
భూమిపై కంటే అంతరిక్షంలో వాతావరణం, అక్కడి గురుత్వాకర్షణ శక్తి భిన్నంగా ఉంటాయి. కాబట్టి అందుకు అనుగుణంగా ఉండే వస్తువులను, ఆహారాన్ని మాత్రమే వ్యోమగాములు భూమి నుంచే తీసుకెళ్తారని పరిశోధకులు చెప్తున్నారు. గతంలో శాస్త్రవేత్తలు అంతరిక్ష వాతావరణంలో ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. చాలా మెత్తగా ఉండే ఆహారం, లిక్విడ్ రూపంలో ఉండే ఆహారం మాత్రమే తీసుకెళ్లేవారు. దానిని ట్యూబ్ ద్వారా తీసుకునేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మరింత డెవలప్ అయింది కాబట్టి ఈ విధానంలో కొంత మెరుగైన మార్పులు వచ్చాయని నిపుణులు చెప్తున్నారు.
ఏడాది వరకు పాడవదు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంవల్ల అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ఇప్పుడు థర్మో-స్టెబిలైజ్డ్ ఫుడ్ ఈజీగా తినగలుగుతున్నారు. అయితే వీరికోసం అక్కడికి తీసుకెళ్లే ఆహారాన్ని భూమిపై ఉన్నప్పుడే నాసా పరిశోధనా కేంద్రాల్లో దానిని సపరేట్‌గా తయారు చేయిస్తారని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆహారం అంతరిక్షంలో ఇది 90 రోజుల నుంచి సంవత్సరం పాటు పాడవకుండా ఉండగలుగుతుంది. మరో విషయం ఏంటంటే.. ఉప్పు, కారం, పంచదార వంటి పొడి రూపంలో ఉండే ఆహారాలు ఎట్టి పరిస్థితిలోకి వ్యోమగాములు తీసుకెళ్లరు. ఎందుకంటే అక్కడి వాతావరణంవల్ల ఈ ఆహారం గాలిలో తేలుతూ ముక్కు ద్వారా లోపలికి వెళ్తే ప్రాణాపాయం సంభవిస్తుంది.
ఎలా తింటారు?
ఇక నాసా ప్రాసెస్ చేసిన ఆహారంలోనే ఉప్పు, కారం వంటివి కలిపేసి ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాల్లో ప్యాక్ చేసి, వాటర్ ఇంజెక్ట్ చేస్తారట. ఈ ఆహారాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు తినేముందు అందులో కొన్ని వేడినీళ్లు కలిపేసి తినాల్సి ఉంటుందని చెప్తారు. వీటితోపాటు సహజంగానే తినగలిగే కొన్ని రకాల గింజలు, ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. అంతరిక్షంలో వెదర్‌ను బట్టి వ్యోమగాములు ఫుడ్ లిమిట్ ప్రకారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెషినరీ స్పూన్స్ కూడా ఉంటాయి.